ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తో నేరుగా చర్చలు జరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన దౌత్య ప్రయత్నాలు తీవ్ర ప్రతిష్టంభనలో పడ్డాయి. అమెరికా విధించిన షరతులను ఉత్తర కొరియా నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా, ట్రంప్ పంపిన వ్యక్తిగత లేఖను కనీసం తెరవకుండానే వెనక్కి పంపింది. అలాగే, ఇరువురు నేతల మధ్య సమావేశం జరపాలన్న అమెరికా ప్రతిపాదనలను కూడా ప్యాంగ్యాంగ్ పట్టించుకోలేదు.
60 అణ్వాయుధాలకు చేరిన నిల్వలు – గుర్తింపు కోసం పట్టు: 2019లో ట్రంప్–కిమ్ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఉత్తర కొరియా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల క్షిపణులతో పాటు దాదాపు 60 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో, తమ దేశాన్ని అధికారికంగా ‘అణ్వస్త్ర దేశంగా’ (Nuclear Power) గుర్తిస్తేనే చర్చలకు వస్తామని కిమ్ స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ డిమాండ్‌కు అమెరికా అంగీకరించకపోవడంతో చర్చలు ముందుకు సాగడం లేదు.
30 ఏళ్ల తర్వాత అరుదైన వేడుక, భారత రాయబారికి కిమ్ స్వాగతం: ఒకవైపు అమెరికాను దూరం పెడుతూనే, మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. నవంబర్ 22న రాజధాని ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన ఒక ప్రత్యేక వేడుకలో, భారతదేశం మరియు రష్యా సహా 10 దేశాల కొత్త రాయబారులకు కిమ్ స్వయంగా ఆతిథ్యం ఇచ్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధినేత స్వయంగా విదేశీ రాయబారుల నుండి నియామక పత్రాలను స్వీకరించడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.











