భారతీయ బయోటెక్ మరియు శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోటెక్ స్టార్టప్ ‘పాప్‌వాక్స్’ (PopVax) క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చేలా ‘ఆర్‌ఎన్ఏ ఫౌండ్రీ’ (RNA Foundry) అనే అత్యాధునిక పరిశోధన మరియు తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రతి రోగి యొక్క ప్రత్యేక జన్యు నిర్మాణాన్ని (Genetic Makeup) ఆధారంగా చేసుకుని, వారికి తగినట్లుగా ప్రత్యేకంగా తయారుచేసే ‘పర్సనలైజ్డ్ ఎంఆర్‌ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను’ (Personalised mRNA Cancer Vaccines) అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
పాప్‌వాక్స్ వ్యవస్థాపకుడు సోహమ్ శంకరన్ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోని అనేక బహుళజాతి ఔషధ సంస్థలు అందరికీ ఒకే రకమైన సామూహిక క్యాన్సర్ మందులను తయారు చేస్తుండగా, తమ సంస్థ ప్రతి రోగి యొక్క క్యాన్సర్ కణాల డీఎన్ఏ వరుసలను (Sequencing details) విశ్లేషించి, కేవలం ఆ రోగి వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన కస్టమైజ్డ్ ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్‌ను రూపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అత్యంత సంక్లిష్టమైన ఎంఆర్‌ఎన్ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సాధార ఫ్రిజ్‌లలోనే నిల్వ ఉంచగలిగే ‘లిపిడ్ నానోపార్టికల్’ ఫార్ములేషన్‌తో ఈ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో ఇప్పటికే నిర్వహించిన మానవ క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతమైన మొదటి ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ కాండిడేట్‌ను ఈ ఆర్‌ఎన్ఏ ఫౌండ్రీలోనే ఉత్పత్తి చేశారు.

రాబోయే 12 నెలల్లో 100 మందికి పైగా రోగులకు పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్లను ఉచితంగా తయారు చేసి అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపింది.
భారతదేశాన్ని వినూత్న ‘డీప్‌టెక్’ మరియు వైద్య పరిశోధనా రంగానికి గ్లోబల్ హబ్‌గా మార్చడంలో హైదరాబాద్‌లోని ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు మరియు సాంకేతిక ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.









