భారత కోర్పొరేట్ దిగ్గజం టివిఎస్ (TVS) గ్రూప్ కుటుంబంలో వ్యాపార యాజమాన్యం మరియు ఆస్తుల పంపిణీకి సంబంధించి తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. టివిఎస్ మోటార్స్ ఛైర్మన్ ఎమిరిటస్ వేణు శ్రీనివాసన్ కుటుంబ ఆస్తులు మరియు బాధ్యతల పంపిణీ పూర్తయిందని చెబుతుండగా, ఆయన భార్య, తాఫే (TAFE) అధినేత్రి మల్లికా శ్రీనివాసన్ మరియు కుమార్తె లక్ష్మి శ్రీనివాసన్‌లు ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. కుటుంబంలో ఎలాంటి తుది ఆర్థిక ఒప్పందం లేదా ఆస్తుల విభాజన జరగలేదని వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం మార్చి 2024లో జరిగిన కుటుంబ అవగాహనా ఒప్పందం (MoU) మరియు కంపెనీల మార్కెట్ విలువల్లో వచ్చిన భారీ వ్యత్యాసం. 2024 ఒప్పందం కేవలం బ్రాండ్ వినియోగం, వ్యాపార పరిమితులు (Non-Compete) మరియు కార్పొరేట్ బాధ్యతలకు సంబంధించిందే తప్ప, అది కుటుంబ ఆస్తుల పంపిణీ ఒప్పందం కాదని మల్లిక, లక్ష్మి వాదిస్తున్నారు. వేణు శ్రీనివాసన్ మరియు ఆయన కుమారుడు సుదర్శన్ వేణు తమకు అనుకూలంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఆస్తి తగవులో రెండు ప్రధాన కంపెనీల యాజమాన్య హక్కులు కీలక అంశంగా మారాయి: అందులో ఒకటి టివిఎస్ మోటార్స్ (TVS Motor Company), ఇది సుదర్శన్ వేణు నాయకత్వంలో నడుస్తున్న ఈ కంపెనీ , దీని మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు ₹1.87 లక్షల కోట్లుగా ఉంది. టివిఎస్ హోల్డింగ్స్ ద్వారా సుదర్శన్ వేణు ఈ కంపెనీపై పట్టు సాధించారు. మరొకటి సుందరం క్లేటన్ (Sundaram-Clayton) దీనిని లక్ష్మి వేణు నిర్వహిస్తున్నారు, దీని ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు ₹2,650 కోట్లుగా ఉంది.
ఒక కంపెనీని మేనేజ్ చేసే బాధ్యత లేదా నాయకత్వం ఇవ్వడం అంటే ఆ కంపెనీ యొక్క పూర్తి ఓనర్షిప్ హక్కులు కట్టబెట్టినట్లు కాదని మల్లిక మరియు లక్ష్మి తేల్చి చెప్పారు. వ్యాపార నిర్వహణ (Management) వేరు, యాజమాన్య హక్కులు (Ownership) వేరు అని, సమానత్వంతో కూడిన పారదర్శకమైన ప్రాసెస్ ద్వారా మాత్రమే ఆస్తుల విభజన జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కోట్లాది రూపాయల విలువైన టివిఎస్ గ్రూప్ ఆస్తుల పంపిణీపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ఈ కార్పొరేట్ కుటుంబ వివాదం రాబోయే రోజుల్లో న్యాయపోరాటానికి దారితీస్తుందా అనే కోణంలో వ్యాపార ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.















