ఫుడ్ డెలివరీ దిగ్గజం జోమాటో (Zomato) మరియు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (Blinkit) ల మాతృ సంస్థ ‘ఎటర్నల్’ (Eternal) సాంకేతిక ప్రపంచంలో మరొక సంచలనానికి తెరదీసింది. వినియోగదారుల గోప్యతకు (Privacy) అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందిస్తున్న సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్ ‘Dark.ai’ ను 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మరియు వైస్ ఛైర్మన్ దేపీందర్ గోయల్ (Deepinder Goyal) ప్రకటించారు. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్బంగా వాటాదారులకు రాసిన లేఖలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం విరివిగా అందుబాటులో ఉన్న ఎఐ చాట్‌బాట్‌లలో సున్నితమైన సమాచారాన్ని, సంభాషణలను పంచుకునేటప్పుడు వినియోగదారులకు డేటా లీకేజీ భయాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రధాన సమస్యకు పరిష్కారంగా ‘Dark.ai’ రూపుదిద్దుకుంటోందని గోయల్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-End Encryption) సాంకేతికతతో పనిచేస్తుంది. ఎటర్నల్ స్వంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పనిచేసే ఫైన్-ట్యూన్డ్ ఓపెన్-వెయిట్ మోడళ్లను ఇందులో ఉపయోగిస్తున్నారని, చట్టపరమైన లేదా ఇతరుల ఒత్తిళ్లు వచ్చినా కూడా వినియోగదారుల సంభాషణలను తాము కూడా చదవలేమని గోయల్ స్పష్టం చేశారు.
ఈ ప్లాట్‌ఫామ్‌ను ముఖ్యంగా పవర్ యూజర్లు అయిన స్టార్టప్ ఫౌండర్లు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, కార్పొరేట్ సంస్థలు మరియు ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్నారు. పోటీ ప్రపంచంలో వ్యాపార రహస్యాలు మరియు కొత్త పరిశోధనల గోప్యత అత్యంత కీలకమైనందున ‘Dark.ai’ వారికి రక్షణ కవచంలా నిలవనుంది. గత కొన్ని నెలలుగా సంస్థ అంతర్గతంగా దీనిని విజయవంతంగా పరీక్షిస్తోంది. ఈ నూతన ఆవిష్కరణతో ఎటర్నల్ కేవలం కామర్స్ రంగానికే పరిమితం కాకుండా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాల సరసన నిలిచే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.











