అరేబియా సముద్రంలో భారత నావికాదళం (Indian Navy) మరియు భారత వైమానిక దళం (IAF) సంయుక్తంగా అత్యంత సాహసోపేతమైన 48 గంటల నిరంతర ఆపరేషన్ నిర్వహించి, సోమాలియా సముద్రపు దొంగల (Somali Pirates) నుండి ఇరాన్ దేశానికి చెందిన ‘అజిని’ (Azini) నౌకను మరియు దానిలోని 20 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించాయి.
అక్టోబర్ 29న సోమాలియా తీరానికి సమీపంలో 12 మంది సాయుధ దొంగలు ఈ ఇరాన్ బోటును అపహరించి, సముద్రంలో ఇతర వాణిజ్య నౌకలపై దాడులు చేయడానికి స్థావరంగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. ముంబై తీరం నుండి దాదాపు 3,000 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో సాగిన ఈ ఉద్రిక్త ఆపరేషన్లో భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక INS కోల్కతా, సుదూర నిఘా విమానాలు మరియు ఐఏఎఫ్ C-17 విమానం ద్వారా ఆకాశం నుండి సముద్రంలోకి దిగిన మార్కోస్ (MARCOS) మెరైన్ కమాండోలు పాల్గొని శత్రువుల ప్లాన్ను తుత్తునియలు చేశారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్న జవాన్లు 12 మంది సాయుధ దొంగలను అరెస్టు చేసి, బంధీలుగా ఉన్న 20 మంది ఇరాన్ సిబ్బందిని సురక్షితంగా విడిపించారు. నవంబర్ 2న ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.
ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ముంబై తీరానికి వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భారత దళాలు చూపిన తక్షణ స్పందన, సమర్థత మరియు ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. సముద్ర భద్రతలో భారత్ ప్రధాన శక్తిగా నిలుస్తుందని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించిందని విశ్లేషకులు ప్రశంసించారు.










