న్యూఢిల్లీ: భారత గగనతలంలో ఇప్పుడు ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధవిమానాల్లో ఒకటైన అమెరికా F-35A Lightning II సందడి చేస్తోంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతున్న ‘తరంగ్ శక్తి 2026’ వైమానిక విన్యాసాల్లో ఆరు F-35A విమానాలు పాల్గొంటున్నాయి. 200 మందికి పైగా అమెరికా వైమానిక సిబ్బంది కూడా ఈ విన్యాసంలో చేరారు. భారత గడ్డపై F-35లు ఒక భారీ సైనిక వైమానిక విన్యాసంలో పాల్గొనడం ఇదే తొలిసారి.
ఒకే ఆకాశంలో F-35, రాఫెల్, సుఖోయ్, తేజస్
సెప్టెంబర్ 26న ప్రారంభమైన తరంగ్ శక్తి 2026 అక్టోబర్ 12 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది విన్యాసానికి “Power in Partnership” అనే థీమ్‌ను పెట్టారు. అమెరికా F-35Aలతో పాటు భారత వాయుసేనకు చెందిన Su-30MKI, Rafale, Tejas వంటి యుద్ధవిమానాలు కూడా ఆపరేషనల్ మిషన్లలో పాల్గొంటున్నాయి. దీంతో భిన్న దేశాలకు చెందిన, భిన్న తరాలకు చెందిన యుద్ధవిమానాలు ఒకే వ్యాయామ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చిన F-35Aలు జపాన్‌లోని Misawa Air Baseకు చెందిన 13th Fighter Squadron నుంచి వచ్చాయి. వాటికి మద్దతుగా ఒక KC-135R Stratotanker ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ విమానం కూడా అమెరికా బలగాలతో ఉంది. ఇలాంటి ఏర్పాట్ల ద్వారా కేవలం యుద్ధవిమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించడం కాకుండా, సుదూర మిషన్లలో ఇంధన సరఫరా, కమ్యూనికేషన్, సమన్వయం వంటి అంశాలను కూడా పరీక్షిస్తున్నారు.
ఎనిమిది దేశాల వైమానిక బలగాలు
భారత్, అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక దళాలు ఈ విన్యాసంలో పాల్గొంటున్నాయి. అమెరికా F-35, ఫ్రాన్స్ రాఫెల్, ఇతర దేశాల F-16, A400M, MRTT, C-130, C-130J, KC-30A వంటి వివిధ రకాల విమానాలు ఈ వ్యాయామాన్ని మరింత వైవిధ్యంగా మార్చాయి. 30కి పైగా ఇతర దేశాలు పరిశీలకులుగా కూడా పాల్గొంటున్నాయి.
F-35 ఎందుకు ప్రత్యేకం?
F-35Aను ఐదో తరం స్టెల్త్ ఫైటర్‌గా పరిగణిస్తారు. శత్రు రాడార్లకు సులభంగా కనిపించకుండా ఉండే low-observable stealth technology, అధునాతన సెన్సర్లు, sensor fusion, సురక్షిత కమ్యూనికేషన్, నెట్‌వర్క్ ఆధారిత సమాచార భాగస్వామ్యం దీని ముఖ్య లక్షణాలు. ఒక పైలట్ తన విమానంలోని సెన్సర్లతో మాత్రమే కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా సమగ్రంగా ఉపయోగించుకునేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది.

ఇదే సమయంలో భారత వాయుసేనకు కూడా F-35 వంటి అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేసే అనుభవం లభిస్తోంది. ముఖ్యంగా రష్యా మూలాలున్న Su-30MKI, ఫ్రెంచ్ Rafale, స్వదేశీ Tejas, అమెరికా F-35A వంటి భిన్నమైన విమానాలు ఒకే మిషన్ వాతావరణంలో పనిచేయడం వల్ల వివిధ ఆపరేషనల్ విధానాలను పరస్పరం అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతోంది.
ఆకాశంలోనే కాదు.. గ్రౌండ్‌లోనూ భాగస్వామ్యం
తరంగ్ శక్తి కేవలం పైలట్ల విన్యాసం కాదు. వివిధ దేశాల గ్రౌండ్ క్రూ, మిషన్ ప్లానర్లు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది కూడా పరస్పరం పనిచేస్తున్నారు. విమానాల నిర్వహణ, మిషన్ ప్రణాళిక, భద్రతా విధానాలు, ఆపరేషనల్ అనుభవాలపై చర్చలు జరుగుతున్నాయి. సెమినార్లు, పారిశ్రామిక సందర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్ టూర్లు, యోగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2024లో జరిగిన తొలి ఎడిషన్ తర్వాత ఇప్పుడు రెండోసారి తరంగ్ శక్తి నిర్వహిస్తున్నారు. భారత వాయుసేనకు ఇది తన సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు, వివిధ దేశాల వైమానిక దళాలతో కలిసి పనిచేసే విధానాలను పరీక్షించుకునే అవకాశం. అమెరికా F-35ల తొలిసారి భారత సైనిక విన్యాసంలో పాల్గొనడం ఈ ఏడాది తరంగ్ శక్తికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.














