వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన Congressional Research Service (CRS) అక్టోబర్ 5న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభమైన ఫిబ్రవరి 28, 2026 నుంచి ఇప్పటివరకు కనీసం 81 విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు దెబ్బతిన్నాయి లేదా పూర్తిగా కోల్పోయాయి. వీటి విలువను భర్తీ చేయడానికి గరిష్ఠంగా సుమారు 3.3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా.
డ్రోన్లకే ఎక్కువ నష్టం
అమెరికా సైనిక నష్టాల్లో అత్యధిక భాగం డ్రోన్లదే. నివేదిక ప్రకారం 45 MQ-9 Reaper డ్రోన్లు కోల్పోయాయి. నిఘా, లక్ష్య గుర్తింపు, దాడుల వంటి కీలక మిషన్లలో ఉపయోగించే ఈ డ్రోన్ల ఒక్కొక్కటి సుమారు 30–50 మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంటాయి. వీటితో పాటు MQ-1 డ్రోన్లు, ఇతర మానవరహిత విమానాలు కూడా దెబ్బతిన్నాయి.
F-15లకు వరుస దెబ్బలు
అమెరికా అత్యంత కీలకమైన యుద్ధ విమానాల్లో ఒకటైన F-15E Strike Eagleకు కూడా గణనీయమైన నష్టం జరిగింది. మొత్తం 12 F-15E విమానాలు దెబ్బతిన్నట్లు లేదా కోల్పోయినట్లు CRS లెక్కించింది. వీటిలో మూడు విమానాలు మార్చి 2న కువైట్‌పై జరిగిన ఒక ఫ్రెండ్లీ-ఫైర్ ఘటనలో కూలిపోయాయి. మరో F-15E ఇరాన్‌పై జరిగిన యుద్ధ చర్యల్లో ధ్వంసమైంది. అదనంగా జోర్డాన్‌లోని Muwaffaq Salti వైమానిక స్థావరంపై జరిగిన దాడుల్లో మరో ఎనిమిది F-15Eలకు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే అవి తిరిగి సేవల్లోకి వచ్చాయి.
F-35, నిఘా విమానాలకూ నష్టం
అమెరికా అత్యాధునిక F-35A Lightning II స్టెల్త్ ఫైటర్ కూడా ఈ నష్టాల జాబితాలో ఉంది. అలాగే గగనతల నిఘా కోసం ఉపయోగించే E-3 Sentry, ఇంధనం నింపే KC-135 Stratotanker విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ఏడు KC-135 విమానాలు నష్టపోయినట్లు నివేదికలో నమోదైంది. ప్రత్యేక కార్యకలాపాలకు ఉపయోగించే MC-130J విమానాలు, రక్షణ చర్యల్లో పాల్గొనే హెలికాప్టర్లు కూడా నష్టపోయాయి.

యుద్ధ వ్యయం మరింత భారీగా
విమానాలు, డ్రోన్ల నష్టమే కాకుండా ఇరాన్‌తో యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఆగస్టు 1 వరకు కోల్పోయిన సైనిక పరికరాలను భర్తీ చేయడానికి 1.9 బిలియన్ నుంచి 3.3 బిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుందని అమెరికా Congressional Budget Office అంచనా వేసింది. సెప్టెంబర్ 3 నాటికి ఇరాన్ యుద్ధానికి మొత్తం వ్యయం 43.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి చట్టసభ సభ్యులకు సమాచారం అందింది.
సైనిక వ్యూహంపై ప్రశ్నలు
81 విమానాలు దెబ్బతినడం లేదా కోల్పోవడం అమెరికా వాయుసేన సామర్థ్యం, భవిష్యత్ సైనిక సిద్ధతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా డ్రోన్లు, యుద్ధ విమానాల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ఇతర ప్రాంతాల్లో అమెరికా సైనిక అవసరాలను తీర్చడానికి తగినంత విమానాలు అందుబాటులో ఉంటాయా? అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలించే అవకాశం ఉంది.
అయితే ఈ సంఖ్య తుది లెక్క కాదని CRS స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగుతుండటం, కొన్ని వివరాలు రహస్యంగా ఉండటం, ఘటనల పరిస్థితులను నిర్ధారించడంలో ఉన్న ఇబ్బందుల కారణంగా భవిష్యత్‌లో ఈ సంఖ్య మారే అవకాశం ఉందని తెలిపింది.













