కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (నవంబర్ 11, 2026) ఉదయం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ముంబై వైపు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు విమానం వాష్‌రూమ్‌లో ‘హైజాక్ బెదిరింపు లేఖ’ లభించడంతో విమానాశ్రయ భద్రతా యంత్రాంగం మరియు సీఐఎస్‌ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఉదయం 10:20 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత, వాష్‌రూమ్ అద్దంపై ఉదయం 11:10 గంటలకు ఈ విమానాన్ని హైజాక్ చేస్తామని రాసి ఉన్న లేఖను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు (ATC) సమాచారం అందించడంతో అత్యవసర భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేశారు. విమానంలోని ప్రయాణికులందరినీ తక్షణమే సురక్షితంగా కిందకు దింపివేసి, విమానాన్ని రన్‌వే నుండి సుదూర ఐసోలేషన్ బేకి తరలించారు.
విమానాశ్రయ అధికారుల పర్యవేక్షణలో బాంబ్ స్క్వాడ్, స్నిప్పర్ డాగ్స్ మరియు సీఐఎస్‌ఎఫ్ భద్రతా బృందాలు విమానం సహా ప్రయాణికుల లగేజీని సమగ్రంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించనప్పటికీ, ఇది అల్లరి మూకల చేష్టా లేదా నిజమైన ముప్పా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ప్రయాణికులకు విమానాశ్రయంలోనే వసతి కల్పించారు.











