టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌కు ప్రత్యామ్నాయంగా చైనా రూట్.. హోటాన్ మీదుగా విమానాలకు మార్గం

India Explores China’s Hotan Air Route as Alternative to Pakistan Airspace Ban
---Advertisement---

న్యూఢిల్లీ: పాకిస్థాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు కొనసాగిస్తూ ఉండటంతో.. అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలోని హోటాన్ మీదుగా విమానాలను నడిపే మార్గంపై చైనాతో చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చలు ఏడాదికిపైగా కొనసాగుతున్నాయని సమాచారం. విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా అధికారులతో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది.

హోటాన్ రూట్ ఎందుకు కీలకం?

భారత్ నుంచి యూరప్, అమెరికా, కెనడా వంటి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలకు పాకిస్థాన్ గగనతలం భౌగోళికంగా అనుకూలమైన మార్గంగా ఉంటుంది. అయితే పాకిస్థాన్ ఆకాశమార్గాన్ని మూసివేయడంతో భారత విమానాలు ప్రస్తుతం అరేబియా సముద్రం, మధ్య ఆసియా వైపు మళ్లి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధనం, సిబ్బంది, విమాన నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కొన్ని మార్గాల్లో అదనంగా 45 నిమిషాల నుంచి రెండు గంటల వరకు ప్రయాణ సమయం పెరుగుతోందని విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో జిన్‌జియాంగ్‌లోని హోటాన్ (Hotan) మీదుగా ప్రత్యామ్నాయ కారిడార్ అందుబాటులోకి వస్తే పశ్చిమ దేశాలకు వెళ్లే కొన్ని విమానాల ప్రయాణ దూరం తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ప్రతిపాదిత మార్గం మాత్రమే. చైనా అనుమతులు, గగనతల నిర్వహణ, భద్రత, సాంకేతిక అంశాలు, విమాన మార్గాల సమన్వయం వంటి అనేక దశలు పూర్తయ్యాకే ఇది ఆచరణలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఏడాదికిపైగా చర్చలు

ప్రభుత్వ వర్గాల ప్రకారం హోటాన్ మార్గంపై భారత్–చైనా మధ్య చర్చలు ఏడాదికిపైగా కొనసాగుతున్నాయి. ఈ అంశం ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న విస్తృత దౌత్య చర్చల్లోనూ భాగంగా ఉంది. అయితే ఇప్పటివరకు చైనా నుంచి ఈ మార్గానికి తుది అనుమతి లభించిందని అధికారిక ప్రకటన లేదు. అందువల్ల భారత విమానాలు త్వరలోనే హోటాన్ మీదుగా ఎగురుతాయని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హోటాన్ మార్గంపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ధృవీకరించారు. పాకిస్థాన్ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఇతర అవకాశాలను కూడా భారత్ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

పాకిస్థాన్ నిషేధం ఎందుకు కొనసాగుతోంది?

2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అనంతరం ఇరుదేశాలు పరస్పరం గగనతల పరిమితులు విధించాయి. పాకిస్థాన్ భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలతో పాటు భారత విమానయాన సంస్థలు నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలకు కూడా తన గగనతలాన్ని మూసివేసింది. సెప్టెంబర్ 16న జారీ చేసిన తాజా NOTAM ద్వారా ఈ నిషేధాన్ని అక్టోబర్ 24, 2026 వరకు పొడిగించింది. దీంతో ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి యూరప్, ఉత్తర అమెరికా వైపు వెళ్లే విమానాలపై ప్రభావం కొనసాగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సుదూర విమానాలను ఎక్కువగా నడిపే ఎయిర్ ఇండియాపై ఈ ప్రత్యామ్నాయ మార్గాల వల్ల ఇంధనం, విమాన సమయం, సిబ్బంది ఖర్చులు పెరుగుతున్నాయి.

భారత్–చైనా విమాన సంబంధాల్లోనూ మార్పులు

హోటాన్ మార్గంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే భారత్–చైనా మధ్య నేరుగా విమాన కనెక్టివిటీ కూడా క్రమంగా పునరుద్ధరిస్తోంది. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ–న్యూఢిల్లీ నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఇండిగో 2025లో కోల్‌కతా–గ్వాంగ్‌జౌ, ఆ తర్వాత ఢిల్లీ–గ్వాంగ్‌జౌ సర్వీసులను పునరుద్ధరించింది. ఎయిర్ ఇండియా కూడా ఫిబ్రవరి 2026లో ఢిల్లీ–షాంఘై సర్వీసును తిరిగి ప్రారంభించింది. ఇక హోటాన్ మార్గం విషయంలో ప్రధాన ప్రశ్న చైనా అనుమతి ఎప్పుడు లభిస్తుంది? అన్నదే. ఈ మార్గం అందుబాటులోకి వస్తే పాకిస్థాన్ గగనతలంపై ఆధారపడకుండా పశ్చిమ దేశాలకు వెళ్లే కొన్ని విమానాలకు తక్కువ దూరం, తక్కువ ప్రయాణ సమయం లభించే అవకాశం ఉంటుంది. అయితే మార్గం ఖరారు కావడం, విమానయాన సంస్థలకు అనుమతులు, భద్రతా నిబంధనలు, వాణిజ్యపరమైన సాధ్యత వంటి అంశాలపై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఇది భారత్ పరిశీలిస్తున్న ప్రత్యామ్నాయ మార్గం మాత్రమే.. తుది విమాన రూట్‌గా ఇంకా ఖరారు కాలేదు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now