న్యూఢిల్లీ: భారత SUV మార్కెట్లో పోటీ మరింత పెరుగుతున్న వేళ హోండా కార్స్ ఇండియా తన ప్రముఖ SUV హోండా ఎలివేట్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొస్తోంది. 2026 హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ధరలను అక్టోబర్ 6న అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ.21,000గా ఉంది. ఫేస్‌లిఫ్ట్‌లో మొదటగా కనిపించేది కొత్త డిజైన్. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మారిన లైటింగ్ డిజైన్ ఎలివేట్‌కు మరింత ఆధునిక రూపాన్ని ఇవ్వనున్నాయి. ముఖ్యంగా హోండా లోగోను గ్రిల్ నుంచి బానెట్‌పైకి మార్చారు. ముందు భాగంలో సెగ్మెంటెడ్ LED లైట్ ఎలిమెంట్స్ కూడా కనిపించనున్నాయి. వెనుక భాగంలోనూ మార్పులు ఉన్నాయి. కనెక్టెడ్ LED లైట్ బార్, కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్, స్వల్పంగా మార్చిన బంపర్ SUVకు కొత్త గుర్తింపును ఇవ్వనున్నాయి. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, కొత్త రంగు ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో కేవలం రూపానికే కాకుండా ఫీచర్లపైనా హోండా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 360-డిగ్రీ కెమెరా కీలకమైన కొత్త ఫీచర్‌గా ఉండనుంది. క్యాబిన్లో మార్పులతో పాటు పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మెరుగైన కనెక్టెడ్ ఫీచర్లు, యాంబియంట్ లైటింగ్, కొత్త ఇంటీరియర్ థీమ్ వంటి మార్పులు ఉండొచ్చని సమాచారం. కొన్ని వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్లు వంటి ఫీచర్లు కూడా రావచ్చని అంచనా. ప్రస్తుత ఎలివేట్‌లో ఉన్న ఆరు ఎయిర్‌బ్యాగ్స్, TPMS, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లేన్-వాచ్ కెమెరా, ADAS వంటి భద్రతా ఫీచర్లు కొనసాగనున్నాయి. హోండా సెన్సింగ్ ADAS వ్యవస్థలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ వంటి భద్రతా టెక్నాలజీలు ఉన్నాయి.
హైబ్రిడ్ మాత్రం లేదు
ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో హైబ్రిడ్ ఇంజిన్ వస్తుందనే ఊహాగానాలు గతంలో వినిపించినప్పటికీ, హోండా ప్రస్తుతం ఈ అవకాశాన్ని పక్కన పెట్టింది. ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుత 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగనుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉండనున్నాయి. హోండా భవిష్యత్తులో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ SUVపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అందువల్ల ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌కు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇవ్వకపోవడం కూడా ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.
క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ?
మిడ్-సైజ్ SUV విభాగంలో ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి విక్టోరిస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లు ఉన్నాయి. టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్ వంటి కొత్త పోటీదారులు కూడా ఈ విభాగాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ధరలపై అధికారిక ప్రకటన అక్టోబర్ 6న వెలువడనుంది. ప్రస్తుతం అంచనా ధరల పరిధి సుమారు రూ.15.30 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉంటుందని కార్వేల్ పేర్కొంది.















