ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో చాట్‌బాట్ ‘క్లాడ్’ (Claude) తయారీదారుగా పేరుగాంచిన ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ పబ్లిక్ ఇష్యూ (IPO) కు సిద్ధమవుతోంది. నవంబర్ 2026లో రాబోయే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువ $1.5 ట్రిలియన్ నుండి $2 ట్రిలియన్ల మధ్య నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూ వల్ల కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ల ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూరి వారిని శతకోటీశ్వరులుగా మార్చే అవకాశం ఉంది.
అయితే ఉద్యోగులకు లభించే ఈ భారీ ఆర్థిక లాభాలు కంపెనీ సీఈఓ డారియో అమోడై (Dario Amodei) కు కొత్త ఆందోళనను తెచ్చిపెట్టాయి. ఆంత్రోపిక్ సంస్థ కేవలం లాభాల కోసం పనిచేసే కంపెనీ కాదని, ఏఐ భద్రత (AI Safety) మరియు మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ అని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగులు కేవలం డబ్బుల కోసమే కాకుండా కంపెనీ లక్ష్యం (Mission) పట్ల కట్టుబడి ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో హెచ్‌ఆర్ (HR) విభాగం ద్వారా ఒక వినూత్నమైన విచిత్రమైన ప్రశ్నను అడుగుతున్నారు:
“ఒకవేళ ఏఐ భద్రత (Safety) కారణాల వల్ల కంపెనీ తన ఏఐ పరిశోధనలను లేదా ఆశయాలను పూర్తిగా నిలిపివేసి, దానివల్ల కంపెనీ స్టాక్ విలువ సున్నా (Zero) కు పడిపోతే మీరు ఎలా స్పందిస్తారు?”
ఈ ప్రశ్న ద్వారా అభ్యర్థులు కేవలం ఐపీఓ బోనస్/ఆర్థిక లాభాల కోసం వస్తున్నారా లేదా కంపెనీ ఏఐ భద్రతా విధానాలకు నిజంగా కట్టుబడి ఉన్నారా అనే విషయాన్ని ఆంత్రోపిక్ పసిగడుతోంది.
ప్రస్తుతం ఆంత్రోపిక్ సంస్థ సిలికాన్ వ్యాలీలో మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు ఓపెన్ ఏఐ వంటి దిగ్గజాలతో పోటీపడుతూ నిపుణులైన ఇంజనీర్లకు ఏడాదికి $3,50,000 నుండి $8,50,000 వరకు భారీ వేతనాలను ఆఫర్ చేస్తోంది. భారీ వేతనాలు ఇస్తున్నప్పటికీ, వ్యాపార లాభాల కంటే భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలనే భావనను కాపాడుకోవడమే ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు ఉద్దేశమని టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.










