ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి చెందిన ఇద్దరు అగ్రగామి దిగ్గజాలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు ఓపెన్ఏఐ (OpenAI) సీఈఓ శామ్ ఆల్ట్మాన్ల మధ్య మాటల యుద్ధం టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గూగుల్ కేవలం తమ పాత ఉత్పత్తులకే ఏఐ సాంకేతికతను పైన అంటిస్తోందని (Bolt-on), అసలైన ఏఐ-ఫస్ట్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం లేదంటూ శామ్ ఆల్ట్మాన్ చేసిన విమర్శలపై సుందర్ పిచాయ్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
శామ్ ఆల్ట్మాన్ వ్యాఖ్యలను సుందర్ పిచాయ్ పూర్తిగా తోసిపుచ్చారు. ఎఐ రంగంలో పోటీ ఎంతో వేగంగా మరియు సవాలుతో కూడుకున్నదిగా ఉందనే విషయాన్ని అంగీకరిస్తూనే, ఓపెన్ఏఐ పోటీ తమను కూడా మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సహించిందని చెప్పారు. అయితే గూగుల్ కేవలం ఉన్న ఉత్పత్తులను సవరించడం మాత్రమే కాకుండా, పునాది స్థాయి (Ground-up) నుంచే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను నిర్మిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఆల్ట్మాన్ చేసిన ‘బోల్ట్-ఆన్’ (పైపైన అంటించడం) విమర్శను ఆయనపైకే తిప్పుతూ పిచాయ్ ఒక ప్రశ్నాస్త్రాన్ని విసిరారు. గూగుల్ జెమిని (Gemini) యాప్‌ను మొదటి నుండి పూర్తిగా ఏఐ ప్రాతిపదికన గ్రౌండ్-అప్ మోడల్‌గా నిర్మించామని తెలిపారు. ఇదే సమయంలో చాట్‌జిపిటి (ChatGPT) ఏఐ ఏజెంట్లను తమ ప్లాట్‌ఫామ్‌కు ఏ విధంగా అనుసంధానిస్తోందని పిచాయ్ ప్రశ్నించారు. “వారు ఏజెంట్లను చాట్‌జిపిటిపై పైపైన అంటిస్తున్నారా లేదా పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్నారా?” అని ఎదురు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఏఐ విప్లవం గురించి వివరిస్తూ, ప్రస్తుత తరుణంలో సఫలీకృతం కావాలంటే రెండు రకాల వ్యూహాలు అవసరమని పిచాయ్ విశ్లేషించారు. ఉన్న ఉత్పత్తులను ఏఐకి అనుగుణంగా మార్చడం మరియు సాంకేతికత ఆధారంగా సరికొత్త అనుభవాలను సృష్టించడం అనేవి రెండూ కలిసొచ్చినప్పుడే వినియోగదారులకు ప్రపంచ స్థాయి ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. మారుతున్న టెక్నాలజీ యుగంలో గూగుల్ నిరంతరం ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.











