సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ సవాళ్ల నడుమ ప్రపంచంలోని అగ్రదేశాలు వరుసగా తమ పౌరులకు మరియు రక్షణ బలగాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విడివిడిగా చూస్తే ఇవన్నీ మామూలు వార్తల్లాగే కనిపించినప్పటికీ, ఒక్క వారం వ్యవధిలోనే ఐదు ప్రముఖ దేశాలు అత్యవసర పరిస్థితులు మరియు యుద్ధ ప్రతికూలతల కోసం సిద్ధం కావాలని సంకేతాలు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
ఆ ప్రకటనలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం:
జపాన్: నవంబర్ 2న నూతన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, జపాన్ ప్రభుత్వం తమ పౌరులందరికీ కనీసం 3 రోజులకు, వీలైతే వారానికి సరిపడా ఆహారం, తాగునీరు మరియు టాయిలెట్ సరుకులను నిల్వ ఉంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. తీవ్రమైన భూకంప ముప్పుల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
యునైటెడ్ కింగ్‌డమ్ (UK): బ్రిటన్ ప్రభుత్వం ప్రారంభించిన “బీ రెడీ” (Be Ready) ప్రచారం ద్వారా ప్రతి కుటుంబం 3 రోజులకు సరిపడా నీరు, క్యాన్డ్ ఫుడ్, అత్యవసర నగదు మరియు రేడియోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ప్రభుత్వం ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా రేడియోల విక్రయాలు పెరిగి స్టాక్ ఖాళీ అవడం గమనార్హం. మరొక సందర్భంలో బ్రిటిష్ సైన్యాన్ని ఉద్దేశించి ఆర్మీ చీఫ్ జనరల్ సర్ రోలీ వాకర్ ప్రసంగిస్తూ, “రాబోయే రోజుల్లో మన దేశానికి మీ అవసరం ఎంతో రానుంది” అంటూ సైనికులను అప్రమత్తం చేశారు.

అమెరికా (US Pentagon): అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తమ స్వదేశీ సైనిక స్థావరాలు బయటి నుంచి ఎటువంటి విద్యుత్, ఇంధనం, నీరు మరియు సమాచార సంబంధాలు లేకపోయినా కనీసం 90 రోజుల పాటు స్వతంత్రంగా పనిచేసేలా ‘ఫోర్ట్రెస్’ (FORTRESS) ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ సందర్భంగా పెంటగాన్ ప్రతినిధి మాట్లాడే క్రమంలో “ప్రస్తుత కాలంలో విద్యుత్ సరఫరానే ప్రధాన యుద్ద రక్షక కవచం” అని వ్యాఖ్యానించారు.
జర్మనీ: జర్మనీ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతి పురుషుడికి తప్పనిసరిగా మిలిటరీ సర్వీస్ ప్రశ్నాపత్రాన్ని పంపుతోంది. దీనిని సమర్పించడంలో విఫలమైతే €250 (యూరోలు) వరకు జరిమానా విధిస్తోంది. ఇప్పటికే ఈ జరిమానాల విధింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
నార్వే: సెల్ఫ్-ప్రిపేర్డ్‌నెస్ వారోత్సవాల సందర్భంగా నార్వే ప్రభుత్వం “సంక్షోభం మరియు యుద్ధ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీరు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు” పేరిట అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, వివిధ దేశాలు ఒకదాని వెంట ఒకటిగా ఇలాంటి అత్యవసర హెచ్చరికలు జారీ చేయడం వెనుక రాబోయే గ్లోబల్ అత్యవసర పరిస్థితులే కారణమా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.










