ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా బనస్కాంత, ఏక్తా నగర్ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బనస్కాంతలో రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 24వ విడత కింద దేశవ్యాప్తంగా రైతులకు సుమారు రూ.19 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు.
బనస్కాంతలో పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భిల్డిలో 127 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేయనున్నారు. కంక్రేజ్ పశు జాతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించే ఈ కేంద్రం ద్వారా పశువుల జన్యు నాణ్యతను మెరుగుపరచడం, ఆధునిక పునరుత్పత్తి సాంకేతికతలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే థరాడ్, రాధన్‌పూర్‌లో బనాస్ డెయిరీ ఆధ్వర్యంలో రోజుకు వరుసగా 75, 100 మెట్రిక్ టన్నుల పశువుల పేడను ప్రాసెస్ చేయగల రెండు బయో-సీఎన్జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నారు. అహ్మదాబాద్ మెట్రో రెండో దశలో విమానాశ్రయం, గిఫ్ట్ సిటీ వరకు పొడిగింపు పనులతో పాటు, అహ్మదాబాద్–మెహసానా రహదారిని నాలుగు వరుసల నుంచి ఎనిమిది వరుసలకు విస్తరించే ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.
రైతులకు ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల బలోపేతంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పూర్తయిన 521 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, సైలోలు, గ్రీన్‌హౌస్‌లు, పంటల ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 1.46 లక్షల హెక్టార్ల పరిధిలో 12 ఉద్యానవన క్లస్టర్ల కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా 1.3 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. ఉత్తర గుజరాత్‌లోని రెండు క్లస్టర్లు బంగాళాదుంప సాగుపై దృష్టి పెట్టనున్నాయి. అదనంగా, గుజరాత్లో 4,030 కొత్త బాలస్నేహపూర్వక అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేసి, పూర్తయిన మరో 361 కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రూ.800 కోట్ల పెట్టుబడి కేటాయించారు. సబర్మతి–వారణాసి ఎక్స్‌ప్రెస్, మెహసానా–బెచరాజీ–సబర్మతి మెము రైలు సేవలను కూడా ప్రారంభించనున్నారు.
అక్టోబర్ 30న ప్రధాని ఏక్తా నగర్లో భారత్ పర్వ్ 2026ను ప్రారంభించనున్నారు. నవంబర్ 15 వరకు కొనసాగే ఈ ఉత్సవంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంప్రదాయాలు, జానపద కళలు, ప్రాంతీయ వంటకాలు, హస్తకళలు, పర్యాటక విశేషాలను ప్రదర్శించనున్నారు. అదే రోజు ఏక్తా ప్రకాశ్ పర్వ్‌లో భాగంగా ప్రత్యేక విద్యుద్దీపాల ప్రదర్శనను వీక్షించి, నర్మదా హారతిలో పాల్గొంటారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద నివాళులర్పిస్తారు. ఏక్తా నగర్లో రూ.400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో నీటి శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పర్యాటక అభివృద్ధి, నర్మదా ఘాట్ ఆధునికీకరణ వంటి పనులు ఉన్నాయి.
జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగే పరేడ్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు దళాలు పాల్గొననున్నాయి. ఈ ఏడాది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భద్రతా బలగాలు సాధించిన విజయాలు, గతంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, భద్రత, అభివృద్ధి సాధించిన తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నక్సల్ రహిత భారత్ ఇతివృత్తంతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో 126 జిల్లాలకు చెందిన సుమారు 2,000 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 5,000 మంది కళాకారులు భారతీయ శాస్త్రీయ, జానపద కళలు, సంగీతం, నృత్య సంప్రదాయాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలన్నింటికీ ‘వందే మాతరం’ ప్రధాన ఇతివృత్తంగా నిలవనుంది.











