వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన H-1B వీసా కార్యక్రమంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త H-1B వీసాలపై విధించిన కఠిన ఆంక్షలను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా అమెరికా వెలుపల ఉన్న H-1B అభ్యర్థులను తీసుకురావాలంటే కొన్ని సందర్భాల్లో యజమానులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన నిబంధనను కొనసాగించారు. ఈ పొడిగింపు 2027 సెప్టెంబర్ 21 వరకు అమల్లో ఉండనుంది.
2025లో ట్రంప్ ప్రభుత్వం H-1B కార్యక్రమంపై కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది. అమెరికా వెలుపల ఉన్న కొన్ని H-1B ఉద్యోగులను దేశంలోకి తీసుకురావడానికి సంబంధించిన పిటిషన్లతో పాటు $100,000 చెల్లింపు చేయాల్సిన నిబంధనను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఆంక్షలను మరో 12 నెలలు కొనసాగిస్తూ సెప్టెంబర్ 21, 2027 వరకు పొడిగించారు. అయితే జాతీయ ప్రయోజనాలకు అవసరమైన సందర్భాల్లో మినహాయింపులు ఇచ్చే అవకాశం కూడా ప్రకటనలో ఉంది.
ఈ నిర్ణయం ముఖ్యంగా అమెరికా వెలుపల ఉన్న, కొత్తగా ప్రవేశించాల్సిన H-1B ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అమెరికాలో H-1B హోదాలో ఉన్నవారిపై ఇదే $1,00,000 చెల్లింపు నిబంధన నేరుగా వర్తించదు అలాగే అమెరికాలో చదువులు పూర్తిచేసి అక్కడే ఉన్న విదేశీ గ్రాడ్యుయేట్లకు కూడా ఈ ప్రత్యేక ప్రవేశ ఆంక్షకు సంబంధించిన పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
భారతీయ టెక్ నిపుణులపై ప్రభావం?

H-1B కార్యక్రమాన్ని అమెరికాలోని టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఇతర ప్రత్యేక నైపుణ్యాల ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భారతీయ నిపుణులు, అలాగే భారతీయ IT సంస్థలకు గణనీయమైన ప్రాధాన్యం ఉంది. కొత్తగా అమెరికాకు ఉద్యోగుల్ని పంపించే సంస్థలకు లక్ష డాలర్ల చెల్లింపు వంటి అదనపు వ్యయం ఎదురైతే నియామకాలు, ఉద్యోగుల స్థాన చలనాలు, కంపెనీల వీసా వ్యూహాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు అంచనాల ప్రకారం, ఇప్పటికే కొన్ని పెద్ద కంపెనీలు విదేశాల్లో, ముఖ్యంగా భారత్లో, తమ కార్యకలాపాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకున్నాయి.
కోర్టుల్లో కొనసాగుతున్న న్యాయపోరాటం
అయితే లక్ష డాలర్ల H-1B చెల్లింపు నిబంధనపై న్యాయపరమైన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ భారీ ఫీజును అమలు చేయడంపై దిగువ కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యాయి. మరోవైపు అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విధానాన్ని కోర్టులో సవాలు చేసింది. అందువల్ల కొత్త నిబంధన భవిష్యత్తులో ఎలా అమలవుతుందనేది న్యాయస్థానాల నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
అమెరికా ప్రభుత్వం చెబుతున్న కారణం
H-1B కార్యక్రమాన్ని కొంతమంది యజమానులు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఉపయోగిస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. తాజాగా విడుదల చేసిన అధ్యక్ష ప్రకటనలో, 2025లో తీసుకొచ్చిన ఆంక్షల తర్వాత H-1B దరఖాస్తుల తీరులో మార్పులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. పెద్ద IT స్టాఫింగ్, ఔట్సోర్సింగ్ సంస్థల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయని, అధిక నైపుణ్యం మరియు అధిక వేతన స్థాయిలకు సంబంధించిన ఎంపికలు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.














