హైదరాబాద్ నగర శివారులోని మియాపూర్లో విలువైన 550 ఎకరాలకు పైగా భూమిపై కొనసాగుతున్న సుదీర్ఘ న్యాయవివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేస్తూ, ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సుమారు 23 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయపోరాటంలో తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజయం లభించింది. ఈ భూముల విలువ రూ.25,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మియాపూర్లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న ఈ భూములపై పలువురు వ్యక్తులు, సంస్థలు యాజమాన్య హక్కులను కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, 1997లో భూకబ్జా కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఈ భూములు ప్రభుత్వానివేనని తీర్పునిచ్చింది. అనంతరం 2003 ఏప్రిల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం వారి అప్పీళ్లను కొట్టివేసింది.
ఈ కేసులో 1912 నాటి భూ రికార్డులు కీలకంగా మారాయి. అప్పటి సర్వేలో ఈ భూములను ప్రభుత్వానికి చెందిన ‘సర్కారీ పోరంబోకు’ భూములుగా నమోదు చేసినట్లు న్యాయస్థానం గుర్తించింది. నిజాం కాలంలో జాగీర్ హక్కులకు సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ, అవి భూమిపై సంపూర్ణ యాజమాన్య హక్కును కల్పించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో జాగీర్ల రద్దు నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, సంబంధిత భూములపై గతంలో ఉన్న పరిమిత హక్కులు కూడా ముగిశాయని పేర్కొంది. భూమి తమదేనని నిరూపించేందుకు పిటిషనర్లు చూపిన పాత పత్రాలు, తదనంతర లావాదేవీలు చట్టబద్ధమైన యాజమాన్యాన్ని స్థాపించలేకపోయాయని ధర్మాసనం అభిప్రాయపడింది.
1950వ దశకానికి చెందిన కొన్ని రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదవడంపై కూడా సుప్రీంకోర్టు పరిశీలన జరిపింది. ఆ నమోదులు నకిలీవని, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సృష్టించినవని దిగువ న్యాయస్థానాలు గుర్తించిన అంశాలను ధర్మాసనం సమర్థించింది. భూమిపై ప్రతికూల స్వాధీనం (Adverse Possession) ద్వారా హక్కులు పొందామన్న వాదనను కూడా అంగీకరించలేదు. భూమి ప్రభుత్వానికి చెందుతుందని గతంలో ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అప్పీళ్లను కొట్టివేసింది.

ఈ తీర్పుతో మియాపూర్లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన స్పష్టత లభించింది. ఈ భూవివాదం పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భూముల పరిరక్షణకు సంబంధించిన న్యాయపరమైన చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పేర్కొంది. ఈ భూముల్లో కొంత భాగం ఇప్పటికే పట్టణాభివృద్ధి సంస్థకు బదిలీ కాగా, మియాపూర్ మెట్రో రైలు డిపో కూడా ఈ భూభాగంలోనే ఉంది.









