తిరుమల, సెప్టెంబర్ 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తుల సందడితో, ఆధ్యాత్మిక వైభవంతో విజయవంతంగా ముగిశాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఇంతటి భారీ రద్దీని నియంత్రిస్తూ భక్తులకు దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత వంటి సేవలను అందించడంలో టీటీడీతో పాటు పోలీసు, జిల్లా యంత్రాంగం, విజిలెన్స్, వైద్య సిబ్బంది, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు సమన్వయంతో పనిచేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
5.76 లక్షల మందికి శ్రీవారి దర్శనం
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిది రోజుల వ్యవధిలో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.28.94 కోట్ల కానుకలు లభించగా, 33 లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించారు. భక్తులకు 21.84 లక్షల అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. మరోవైపు 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ ప్రధాన వాహనసేవలతో పాటు మూలవిరాట్ దర్శనాన్ని కూడా భక్తులకు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది.
గరుడసేవకు ప్రత్యేక భద్రత
బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడసేవ రోజున భక్తుల రద్దీ మరింత పెరగడంతో భద్రత, క్యూలైన్లు, గ్యాలరీలు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బంది విధుల్లో ఉండగా, గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులను మోహరించారు. తిరుమల, తిరుపతిలో ముందస్తు పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టారు.
వైద్య సేవల నుంచి పారిశుద్ధ్యం వరకు
భారీగా తరలివచ్చిన భక్తుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. అదే సమయంలో గరుడసేవ రోజున సుమారు 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేకంగా సేవలందించారు. ఒక్కరోజులో సేకరించిన దాదాపు 173 టన్నుల తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. మరుగుదొడ్ల శుభ్రత, తాగునీరు, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగింది.
భక్తుల కోసం ముందస్తు ప్రణాళిక
బ్రహ్మోత్సవాలకు ముందే టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు, మున్సిపల్, రవాణా, వైద్య తదితర విభాగాలు కలిసి సమగ్ర కార్యాచరణ రూపొందించాయి. రద్దీని బట్టి భక్తుల ప్రవాహాన్ని మార్చేందుకు హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో వాహనసేవలను భక్తులు వీక్షించేందుకు భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా వివిధ శాఖలను సమన్వయం చేయాలని ముందుగానే నిర్ణయించారు. చివరి రోజు చక్రస్నానం సందర్భంగా కూడా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. గ్యాలరీల నుంచి భక్తులను దశలవారీగా అనుమతించడం, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, స్విమ్మింగ్ బృందాలు, బోట్లను సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టారు.
7,871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు
బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 295 కళాబృందాల నుంచి 7,871 మంది కళాకారులు వాహనసేవల ముందు తమ ప్రదర్శనలు ఇచ్చారు. గరుడసేవ రోజునే 14 రాష్ట్రాలకు చెందిన 32 కళాబృందాల నుంచి 916 మంది కళాకారులు పాల్గొన్నారు. తొలిసారిగా జర్మనీ, సింగపూర్‌కు చెందిన విదేశీ కళాబృందాలు కూడా ప్రదర్శనలు ఇవ్వడం ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పూల అలంకరణలు.. డిజిటల్ స్క్రీన్లు
తిరుమలలో పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు సుమారు 60 టన్నుల పూలు, నాలుగు లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పూలను వినియోగించినట్లు టీటీడీ తెలిపింది. విద్యుత్ అలంకరణలతో పాటు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి, గ్యాలరీల్లో ఉన్న భక్తులకు వాహనసేవలను సులభంగా వీక్షించే అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఈ విజయాన్ని ఏ ఒక్క విభాగానికో పరిమితం చేయకుండా అర్చకులు, ఉద్యోగులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, మీడియా, భక్తుల సమిష్టి సహకార ఫలితంగా పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నప్పటికీ వివిధ విభాగాల సమన్వయంతో సేవలను కొనసాగించడం ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణలో ప్రధాన అంశంగా నిలిచింది.












