భోపాల్: భారతదేశంలో చిరుతల పునరావాస కార్యక్రమానికి మరో కీలక విజయం లభించింది. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ఒకేసారి ఐదు ఆరోగ్యకరమైన చిరుత పిల్లలు జన్మించాయి. భారతదేశంలోనే జన్మించిన ఆడ చిరుత KJP21 ఈ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పరిణామంతో దేశంలోని చిరుతల సంఖ్య 60కు చేరగా, వాటిలో 41 చిరుతలు భారత గడ్డపైనే జన్మించడం విశేషం.
భారత గడ్డపై పుట్టిన చిరుత నుంచి మరో తరం
KJP21 వయసు ప్రస్తుతం 32 నెలలు. భారతదేశంలో జన్మించి, ఇక్కడే పెరిగిన ఈ చిరుత విజయవంతంగా పిల్లలకు జన్మనివ్వడం పునరావాస కార్యక్రమంలో ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. భారతదేశంలో పుట్టి, తిరిగి సంతానాన్ని కనిన మూడో ఆడ చిరుతగా KJP21 గుర్తింపు పొందింది. ఈ ఐదు పిల్లల జననం ద్వారా దేశంలో చిరుతల సంఖ్య పెరగడమే కాకుండా, భవిష్యత్తులో స్వయం సమృద్ధిగా మనుగడ సాగించగల చిరుతల జనాభా ఏర్పాటుకు మరింత ఆశలు చిగురించాయి.
జన్యు వైవిధ్యానికి ప్రాధాన్యం
ఈ చిరుత పిల్లల తండ్రి బోట్స్వానాకు చెందిన చిరుత. అందువల్ల ఈ కొత్త తరం భారతదేశంలోని చిరుతల జనాభాకు విలువైన జన్యు వైవిధ్యాన్ని అందించే అవకాశం ఉంది. జన్యు వైవిధ్యం ఒక జంతు జాతి ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి, మారుతున్న పర్యావరణ పరిస్థితులను తట్టుకోవడానికి, వ్యాధుల ముప్పును ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది. భారత్‌లో చిరుతలు అంతరించిపోయిన దశాబ్దాల తర్వాత వాటిని తిరిగి ప్రవేశపెట్టేందుకు 2022లో ‘ప్రాజెక్ట్ చీతా’ ప్రారంభమైంది. తొలుత నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను కూనోకు తీసుకొచ్చారు. 2023లో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకొచ్చారు. అనంతరం 2026 ఫిబ్రవరిలో బోట్స్వానా నుంచి తొమ్మిది చిరుతలు భారత్‌కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమం లక్ష్యం కేవలం ఇతర దేశాల నుంచి చిరుతలను తీసుకురావడమే కాదు. అవి భారత వాతావరణం, పర్యావరణ పరిస్థితులకు అలవాటుపడి, సంతానోత్పత్తి ద్వారా తమ సంఖ్యను సహజసిద్ధంగా పెంచుకుని అడవిలో స్వేచ్ఛగా జీవించే స్థాయికి చేరుకోవడం.
వన్యప్రాణి వారోత్సవంలో చారిత్రక ఘట్టం
వన్యప్రాణి వారోత్సవం–2026 సందర్భంగా ఈ పరిణామంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. చిరుతల సంరక్షణలో పాల్గొంటున్న పశువైద్యులు, అటవీశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. ఐదు చిరుత పిల్లల జననం కేవలం సంఖ్య పెరగడమే కాదు.. భారతదేశంలో చిరుతల స్థిరమైన జనాభాను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి కొత్త ఆశను అందిస్తోంది. ఈ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగి, భవిష్యత్తులో తమ సంతానాన్ని కనగలిగితే, భారతదేశంలో చిరుతల పునరాగమన ప్రయాణం మరింత బలపడనుంది.










