టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

ఐపీఎల్ 2027కు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ

Sourav Ganguly Takes Charge as Delhi Capitals Head Coach for IPL 2027
---Advertisement---

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఐపీఎల్ 2027 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. గత రెండు సీజన్లలో జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన హేమంగ్ బదానీ స్థానంలో గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ఈ నియామకాన్ని ప్రకటించింది.

ఢిల్లీతో గంగూలీకి పాత అనుబంధం

గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం ఇప్పటిది కాదు. 2019లో ఫ్రాంచైజీకి అడ్వైజర్‌గా చేరిన ఆయన, ఆ తర్వాత జట్టు క్రికెట్ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. పురుషులు, మహిళల జట్లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కూడా పనిచేశారు. దక్షిణాఫ్రికా SA20లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు గత సీజన్‌లో హెడ్ కోచ్‌గా వ్యవహరించి ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు తొలిసారిగా ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం గంగూలీ కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారింది.

“ఢిల్లీ క్యాపిటల్స్ నా హృదయానికి దగ్గరైన జట్టు”

తన నియామకంపై గంగూలీ స్పందిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ తనకు చాలా దగ్గరైన ఫ్రాంచైజీ అని పేర్కొన్నారు. జట్టు యాజమాన్యం, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లతో గతంలోనే కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. ప్రతిభావంతమైన ఆటగాళ్లతో కూడిన జట్టును మరింత బలోపేతం చేసి, బలమైన, భయంలేని జట్టు”గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గంగూలీ తెలిపారు.

తొలి ఐపీఎల్ టైటిల్ కోసం కొత్త ప్రయత్నం

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. 2020లో ఫైనల్‌కు చేరినప్పటికీ ట్రోఫీని అందుకోలేకపోయింది. గత రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయిన జట్టు, 2026లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో గంగూలీ నియామకం జట్టు పునర్నిర్మాణంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. కెప్టెన్ అక్షర్ పటేల్, తిరిగి జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లతో కలిసి గంగూలీ కొత్త సీజన్‌కు వ్యూహాలు సిద్ధం చేయనున్నారు.

“దాదా”తో కొత్త అధ్యాయం

ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ గంగూలీని తమ కుటుంబంలో అంతర్భాగంగా అభివర్ణించారు. భారత క్రికెట్‌లో గొప్ప కెప్టెన్లు, నిర్వాహకుల్లో ఒకరైన గంగూలీ కోచింగ్ బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని చెప్పారు. ఆయన నాయకత్వం, అనుభవం జట్టును ఐపీఎల్ టైటిల్ కోసం మరింత సిద్ధం చేస్తుందని జిందాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారిక ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. “దాదా” నాయకత్వంలో ఈసారి ఢిల్లీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తుందా అన్నదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చగా మారింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now