టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

‘ఎక్స్‌’లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. రాజీవ్‌తో తొలి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ వీడియో

---Advertisement---

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తొలిసారిగా సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లోకి అడుగుపెట్టారు. తన తొలి పోస్ట్‌గా దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, త్వరలో విడుదల కానున్న తన పుస్తకం గురించి ఒక వీడియోను పంచుకున్నారు. ‘బిలాంగింగ్‌ – ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో ఆమె రాసిన ఈ పుస్తకం నవంబర్‌ 10న పాఠకుల ముందుకు రానుంది. 

దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో సోనియా గాంధీ తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో తాను రాజీవ్‌ గాంధీని మొదటిసారి కలిసిన సందర్భాన్ని వివరించారు. అప్పట్లో ఇటాలియన్‌ ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో ‘వర్సిటీ రెస్టారెంట్‌’ గురించి తెలిసిందని చెప్పారు. గ్రీకు వంటకాలు అందించే ఆ రెస్టారెంట్‌కు యూరప్‌, భారత్‌కు చెందిన విద్యార్థులు వచ్చేవారని, అక్కడే ఉమ్మడి స్నేహితుడి ద్వారా రాజీవ్‌ గాంధీతో పరిచయం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. 

రాజీవ్‌ గాంధీని తొలిసారి కలిసినప్పుడే ఆయనతో జీవితాన్ని పంచుకోవాలనే భావన కలిగిందని సోనియా తెలిపారు. ఆయన అందంగా ఉండటంతో పాటు ఎంతో సౌమ్యంగా కనిపించేవారని, ముఖ్యంగా ఆయనలోని సున్నితమైన స్వభావం తనను ఆకట్టుకుందని చెప్పారు. పరిచయం స్నేహంగా మారిన తర్వాత ఇద్దరూ స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం, వివిధ ప్రదేశాలను సందర్శించడం వంటి అనుభవాలను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ తొలి పరిచయం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని పేర్కొన్నారు. 

తన తొలి ఎక్స్‌ పోస్ట్‌లో సోనియా గాంధీ, కేంబ్రిడ్జ్‌లోని ఒక చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో తన ప్రేమ ప్రయాణం ప్రారంభమైందని పేర్కొన్నారు. రాజీవ్‌ గాంధీతో కలిసి ప్రేమ, నవ్వులు, జ్ఞాపకాలతో నిండిన జీవితాన్ని నిర్మించుకున్నామని, ఆ అనుభవాలను నవంబర్‌ 10న అందరితో పంచుకోబోతున్నానని తెలిపారు. ఈ వీడియోలో ఇద్దరూ కలిసి ఉన్న పాత ఛాయాచిత్రాలతో పాటు, తొలిసారి కలుసుకున్న రెస్టారెంట్‌ చిత్రాలను కూడా చూపించారు. 

‘బిలాంగింగ్‌ – ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ సోనియా గాంధీ తొలి పుస్తకం. ఇందులో ఇటలీలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్‌ గాంధీతో పరిచయం, వివాహం, భారత్‌కు రావడం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల వరకు ఆమె ప్రయాణం చోటుచేసుకోనుంది. అంతకుముందు అక్టోబర్‌ 22న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అడుగుపెట్టి పుస్తకానికి సంబంధించిన తొలి వీడియోను పంచుకున్నారు. ప్రేమ, బాధ్యత, నష్టం, తనకు చెందిన స్థలాన్ని కనుగొనడం వంటి అంశాలు ఈ పుస్తకంలో ప్రధానంగా ఉంటాయని ఆమె వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now