Home » News » ఆకలిని ఆపే ఇంజెక్షన్: బరువు తగ్గుతుంది, కానీ ఎంతకాలం?

ఆకలిని ఆపే ఇంజెక్షన్: బరువు తగ్గుతుంది, కానీ ఎంతకాలం?

రాత్రి పదకొండు గంటలు. సారా వంటగదిలో నిల్చుని స్టోర్‌రూమ్ వైపు చూస్తోంది. ఏళ్ల తరబడి ఆమె మెదడులో ఒక అలారం మోగుతూనే ఉంది  “నీకు ఆకలేస్తోంది, ఏదైనా తిను” అని. ఆ శబ్దం ఆమెను ప్రతి అర్ధరాత్రి ఫ్రిజ్ దగ్గరకు లాక్కెళ్లేది. ఇప్పుడు వారానికి ఒకసారి వేసుకునే చిన్న పెన్-ఇంజెక్టర్ ఆ అలారాన్ని ఆపేసింది. ఇంజెక్షన్ తీసుకున్న 24 గంటల్లోనే లోపల నిశ్శబ్దం. ఎదురుగా ఉన్న బిస్కెట్‌ను చూసి ఏ ఆసక్తీ కలగకుండా ఆమె పక్కకు వెళ్లిపోతుంది.

ఆకలిని ఆపే ఇంజెక్షన్: బరువు తగ్గుతుంది, కానీ ఎంతకాలం

ఒక్క ఇంజెక్షన్‌తో నెలనెలా బరువు కరిగిపోతుందంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు? గత మూడేళ్లుగా ప్రపంచ ఆరోగ్య రంగంలో అత్యధికంగా చర్చకు వస్తున్న అంశం ఇదే — జీఎల్‌పీ-1 (GLP-1) ఆధారిత బరువు తగ్గించే మందులు. సెమాగ్లుటైడ్ (ఒజెంపిక్, వెగోవి), టిర్జెపటైడ్ (మౌంజారో, జెప్‌బౌండ్) వంటి పేర్లు ఇప్పుడు వైద్య పత్రికల్లోనే కాదు, సినిమా తారల ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా రీల్స్‌లోనూ వినిపిస్తున్నాయి. కానీ ఇవి నిజంగా ఊబకాయానికి శాశ్వత పరిష్కారమా అన్నదే అసలు ప్రశ్న.

మనం ఆహారం తిన్నప్పుడు పేగుల్లో సహజంగా విడుదలయ్యే హార్మోన్ జీఎల్‌పీ-1. ఇది మూడు పనులు చేస్తుంది: క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది, కడుపు నుంచి ఆహారం కిందికి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది, మెదడులోని ఆకలి కేంద్రాలకు ‘కడుపు నిండింది’ అనే సంకేతం పంపుతుంది. కానీ ఈ సహజ హార్మోన్ కొన్ని నిమిషాల్లోనే శరీరంలో కరిగిపోతుంది.

శాస్త్రవేత్తలు దాని అణు నిర్మాణాన్ని కొద్దిగా మార్చి, రక్తంలో వారం రోజుల పాటు నిలిచేలా తయారు చేశారు. ఫలితం – వారానికి ఒక్క ఇంజెక్షన్. మందు వాడేవారికి ఆకలి తగ్గుతుంది, తక్కువ తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది, ఆహారం గురించిన నిరంతర ఆలోచనలు (దీన్ని ‘ఫుడ్ నాయిస్’ అంటారు) తగ్గిపోతాయి. టిర్జెపటైడ్ అనేది మరో ఎంపిక. ఇది ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. ఇది జీఎల్‌పీ-1తో పాటు జీఐపీ అనే మరో పేగు హార్మోన్ పనినీ అనుకరిస్తుంది. రెండు మార్గాలు కలిసి పనిచేయడం వల్ల బరువు మరింత ఎక్కువగా తగ్గుతుంది.

అంతకంటే ముఖ్యమైనది  ఇవి కేవలం బరువుకే పరిమితం కాలేదు. గుండెపోటు, పక్షవాతం దాదాపు 20 శాతం తగ్గినట్టు పెద్ద అధ్యయనాల్లో తేలింది. మధుమేహ నియంత్రణ, స్లీప్ అప్నియా, కిడ్నీ వ్యాధి, కాలేయంలో కొవ్వు వంటి సమస్యల్లోనూ మెరుగుదల కనిపించింది. అందుకే వీటిని కేవలం ‘సన్నబడే మందులు’గా కాక జీవక్రియ వ్యాధులకు చికిత్సగా చూడాలని పరిశోధకులు చెబుతున్నారు.

కానీ ఈ మందుల వాడకం వల్ల కొన్ని ఇబ్బందులు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా వస్తాయి

ఇన్ని ప్రయోజనాలు ఉన్నా, ఈ మందులు ప్రతి ఒక్కరికీ సులువుగా సరిపోవు. వాడకం మొదలుపెట్టిన వారిలో చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వికారం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు చాలా సాధారణం. కొందరిలో మందు మానేసేంత తీవ్రంగా ఉంటాయి. అరుదుగా క్లోమవాపు (పాంక్రియాటైటిస్), పిత్తాశయ రాళ్లు, కడుపు కదలికలు స్తంభించే గ్యాస్ట్రోపరేసిస్ నమోదయ్యాయి.

అంతకంటే పెద్ద ఆందోళన  ఏంటంటే తగ్గే బరువులో గణనీయమైన భాగం కొవ్వు కాదు, కండరం. కొన్ని అధ్యయనాల ప్రకారం కోల్పోయిన బరువులో నాలుగింట ఒక వంతు నుంచి మూడింట ఒక వంతు వరకు కండర ద్రవ్యరాశే. వృద్ధుల్లో ఇది బలహీనతకు, పడిపోవడాలకు దారితీయవచ్చు.

మౌంజారో, వెగోవి వంటి బ్రాండ్లు ఇప్పుడు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని కంపెనీల పేటెంట్ గడువు ముగియనుండటంతో వచ్చే ఏడాదిల్లో చౌక వెర్షన్లూ రావచ్చని అంచనా

వైద్య అవసరం లేని, సాధారణ బరువున్న యువత కేవలం ‘ఫిట్‌’గా కనిపించడానికి ఈ మందులు వాడుతున్న ధోరణి పెరుగుతోంది. ఎలాంటి వైద్య అవసరం లేకుండా, కేవలం సన్నగా కనిపించాలనే ఉద్దేశంతో వీటిని వాడేవారికి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇప్పటికే మామూలు బరువున్నవారిలో పోయే కొవ్వు తక్కువ, కరిగే కండరం ఎక్కువ. దాంతో బలం తగ్గుతుంది, జీవక్రియ నెమ్మదిస్తుంది. మందు నిలిపివేసిన ఏడాదిలోపే తగ్గిన బరువులో మూడింట రెండొంతులు తిరిగి వచ్చినట్టు ఫాలో-అప్ అధ్యయనాల్లో తేలింది. అంటే ఇది కోర్సు కాదు, జీవితాంతం కొనసాగించాల్సిన చికిత్స.

చివరగా నిపుణులు చెప్పేది ఏంటంటే ఇది మంత్రదండం కాదు, ఒక పనిముట్టు మాత్రమే. వైద్యుడి పర్యవేక్షణ, సరైన ఆహారం, ప్రోటీన్, వ్యాయామం ఈ నాలుగూ తోడైతేనే ఈ మందు నిజంగా పనిచేస్తుంది. లేకపోతే ఖర్చు మిగులుతుంది, ఫలితం మిగలదు. ఇక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్‌లైన్‌లో కొనడం, సొంత వైద్యం చేసుకోవడం మాత్రం ప్రాణాలతో చెలగాటమే.

(గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏ మందునైనా వాడే ముందు అర్హత గల వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.)

Home

Stories

Follow

Telegram

Instagram