పారిస్: బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తన ప్రత్యేకతను చాటుకున్నారు. పారిస్ ఫ్యాషన్ వీక్ 2026లో భాగంగా జరిగిన L’Oréal Paris Le Défilé రన్‌వేపై ఆమె అద్భుతమైన లుక్‌తో సందడి చేశారు. సెప్టెంబర్ 28న ఈ ఫ్యాషన్ షో పారిస్‌లోని Place Joffre వద్ద, ఈఫిల్ టవర్ నేపథ్యంగా జరిగింది. నల్లటి వెల్వెట్ గౌన్, క్రిస్టల్ అలంకరణలతో కూడిన కేప్, డైమండ్ క్రౌన్, ఎర్రటి జుట్టుతో ఐశ్వర్య కనిపించడంతో ఫ్యాషన్ ప్రపంచం దృష్టి మొత్తం ఆమెవైపే మళ్లింది.
రాయల్ లుక్‌లో ఐశ్వర్య
ఈసారి ఐశ్వర్య ధరించిన దుస్తులు సిరియన్ లగ్జరీ డిజైనర్ లేబుల్ Yara Shoemaker రూపొందించినవి. బ్లాక్ వెల్వెట్ గౌన్‌కు క్రిస్టల్స్‌తో అలంకరించిన కేప్‌ను జోడించారు. దానికి తోడు డైమండ్‌లతో మెరిసే క్రౌన్ ఆమె లుక్‌కు మరింత రాజసమైన టచ్ ఇచ్చింది. అయితే ఈ లుక్‌లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది మాత్రం ఆమె కొత్త హెయిర్ కలర్. ఐశ్వర్య తన జుట్టును ఫైరీ రెడ్ షేడ్‌లో స్టైల్ చేసుకున్నారు. రెడ్ లిప్, వింగ్డ్ ఐలైనర్‌తో ఈ లుక్ పూర్తిగా భిన్నంగా కనిపించింది.
ఈ షోలో ఐశ్వర్య ర్యాంప్ వాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. L’Oréal Parisకి ఆమె చాలాకాలంగా గ్లోబల్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది Le Défilé తొమ్మిదో ఎడిషన్ కాగా, “Express Your Worth” అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆత్మవిశ్వాసం, వైవిధ్యం, సోదరీభావం, స్వీయ విలువ వంటి అంశాలను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చింది.
కేండల్ జెన్నర్, సిమోన్ యాష్లీతో కలిసి
ఈ ఫ్యాషన్ షోలో ఐశ్వర్య ఒక్కరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పలువురు సెలబ్రిటీలు కూడా ర్యాంప్‌పై సందడి చేశారు. Kendall Jenner, Simone Ashley, Eva Longoria, Viola Davis, Jane Fonda, Cara Delevingne, Andie MacDowell, Celine Dion తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో L’Oréal Paris రన్‌వే ఒక స్టార్-స్టడెడ్ ఈవెంట్‌గా మారింది.
ప్రత్యేకంగా ఐశ్వర్య, సిమోన్ యాష్లీ మధ్య బ్యాక్‌స్టేజ్‌లో కనిపించిన ఆత్మీయ క్షణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ చేతులు పట్టుకుని పలకరించుకోవడం, కలిసి ఫొటోలకు పోజులివ్వడం అభిమానులను ఆకట్టుకుంది. సిమోన్ యాష్లీ మాట్లాడుతూ.. ఏడాది పొడవునా కలిసి ఉండే అవకాశం లేకపోయినా, ఇలాంటి ఫ్యాషన్ ఈవెంట్లలో మళ్లీ కలుసుకోవడం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు.
సెలిన్ డియాన్‌తో ప్రత్యేక క్షణం
షోలో మరో హైలైట్ ఐశ్వర్య రాయ్, ప్రముఖ గాయని Celine Dion కలిసి కనిపించిన దృశ్యాలు. ఇద్దరూ చేతులు పట్టుకుని, ఒకరినొకరు హత్తుకుని అభివాదం చేసుకున్నారు. అనంతరం ర్యాంప్‌పై సరదాగా డ్యాన్స్ చేయడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
“Once a Queen, Forever a Queen” అంటూ అభిమానులు
ఐశ్వర్య ర్యాంప్‌పై కనిపించిన వెంటనే ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఆమె నడక, కాన్ఫిడెన్స్, రాయల్ లుక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. “Once a Queen, Forever a Queen”, “Royalty herself” అంటూ పలువురు కామెంట్లు చేశారు. ముఖ్యంగా క్రౌన్, రెడ్ హెయిర్, బ్లాక్ గౌన్ కలయికను అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యకు ఇది కొత్తేమీ కాదు. ఎన్నో సంవత్సరాలుగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. ఈసారి కూడా L’Oréal Paris గ్లోబల్ అంబాసిడర్‌గా తనదైన ముద్ర వేశారు. ఈఫిల్ టవర్ నేపథ్యంగా సాగిన రన్‌వేపై ఆమె కనిపించిన తీరు మరోసారి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై భారతీయ సినీ తారలకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేసింది.
















