ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ కాకుండా బయటి మూలాల (థర్డ్ పార్టీ వెబ్సైట్లు) నుంచి ఏపీకే (APK) ఫైళ్ల ద్వారా యాప్‌లను ఇన్స్టాల్ చేసే ‘సైడ్‌లోడింగ్’ విధానంలో గూగుల్ సంచలన మార్పులు చేపట్టింది. స్కామర్లు, హ్యాకర్ల బారిన పడకుండా వినియోగదారులను రక్షించేందుకు ‘అడ్వాన్స్డ్ ఫ్లో’ (Advanced Flow) పేరిట సరికొత్త సైడ్‌లోడింగ్ నిబంధనలను గూగుల్ అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 7 లేదా ఆపై వెర్షన్లలో పనిచేసే డివైజ్ కలిగిన బ్రెజిల్, థాయ్‌లాండ్, సింగపూర్ మరియు ఇండోనేషియా దేశాల్లో ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.
ఈ నూతన ప్రక్రియ ప్రకారం.. ఇకపై ఆండ్రాయిడ్ వినియోగదారులు గుర్తింపు లేని (Unregistered) డెవలపర్ల నుంచి యాప్‌లను సైడ్‌లోడ్ చేయాలంటే డెవలపర్ ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేసి, డివైజ్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏకంగా 24 గంటల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే గూగుల్ ఆమోదించిన అఫీషియల్ యాప్ స్టోర్లు అయిన గూగుల్ ప్లే స్టోర్, శామ్సంగ్ గెలాక్సీ స్టోర్, షియోమీ గెట్ యాప్స్, ఒప్పో, వివో, ఆనర్ మరియు ట్రాన్సిషన్ స్టోర్ల ద్వారా యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదు. ఆన్లైన్ మోసగాళ్లు ఆతురుతలో వినియోగదారులతో హానికరమైన యాప్‌లను ఇన్స్టాల్ చేయించకుండా నిరోధించడానికే ఈ 24 గంటల నిరీక్షణ వ్యవధిని తీసుకొచ్చినట్లు గూగుల్ స్పష్టం చేసింది.
గూగుల్ ఈ నిర్ణయాన్ని భద్రతా చర్యగా అభివర్ణిస్తున్నప్పటికీ, ఆండ్రాయిడ్ లవర్స్ మరియు డెవలపర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆండ్రాయిడ్ అందించే స్వేచ్ఛను తగ్గించి, ఐఓఎస్ (iOS) తరహాలో క్లోజ్డ్ ఎకోసిస్టమ్‌గా మార్చేందుకు ఇది మొదటి అడుగు అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధనలు నాలుగు దేశాలకే పరిమితమైనప్పటికీ, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలకు కూడా ఈ కొత్త ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ విస్తరించనుంది.













