దుబాయ్: క్రికెట్లో ఇకపై చిన్న చిన్న విషయాల్లోనూ అంపైర్ నిర్ణయాలు మరింత కీలకం కానున్నాయి. ఆట వేగాన్ని పెంచడం, అనవసర సమయ వృథాను అరికట్టడం, బంతుల ప్రమాణాలను స్పష్టీకరించడం, ఫీల్డింగ్ నిబంధనల్లో ఉన్న సందేహాలను తొలగించడం లక్ష్యంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త ప్లేయింగ్ కండిషన్స్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పులు 2026 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే అంతర్జాతీయ సిరీస్‌లకు వర్తిస్తాయి. ఇప్పటికే కొనసాగుతున్న సిరీస్‌లకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయి.
బ్యాటర్ ఆలస్యం చేస్తే.. ఇక జరిమానా తప్పదు!
కొత్త నిబంధనల్లో బ్యాటర్ల సమయ వృథాపై ఐసీసీ మరింత కఠినంగా వ్యవహరించనుంది. బ్యాటర్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోతే మొదట హెచ్చరిక ఇస్తారు. అదే తప్పు రెండోసారి చేస్తే చివరి హెచ్చరిక ఇస్తారు. మూడోసారి, ఆ తర్వాత ప్రతి సారి అదే విధంగా ఆలస్యం చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభిస్తాయి. పదేపదే ఇలా చేస్తే ప్రవర్తనా నియమావళి కింద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇక నుంచి బ్యాటర్ క్రీజులోకి రావడం, గ్లవ్స్ సర్దుకోవడం, బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం వంటి వాటిలో అనవసర ఆలస్యం చేస్తే జట్టుకే నష్టం కలగొచ్చు.
మహిళల క్రికెట్లో బంతికి కొత్త ప్రమాణాలు
మహిళల, జూనియర్ క్రికెట్లో ఉపయోగించే బంతుల పరిమాణం, బరువుకు సంబంధించి కూడా ఐసీసీ కొత్త పరిమితులను తీసుకొచ్చింది. ఇప్పటివరకు కొన్ని సందర్భాల్లో మహిళల, జూనియర్ క్రికెట్‌కు ఒకే రకమైన బంతులను తయారు చేసే పరిస్థితి ఉండేది. ఇకపై పురుషులు, మహిళలు, జూనియర్ల కోసం మూడు ప్రత్యేక పరిమాణ–బరువు ప్రమాణాలు ఉండనున్నాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో బంతుల ప్రమాణీకరణ మరింత స్పష్టంగా మారనుంది.
టెస్టుల్లో పింక్ బాల్.. అదీ పగటి పూట!

కొత్త నిబంధనల్లో అత్యంత ఆసక్తికరమైన మార్పు టెస్టు క్రికెట్‌కు సంబంధించినది. ఇరు జట్లు ముందుగానే అంగీకరిస్తే పగటి సమయంలో జరిగే టెస్టుల్లో పింక్ బాల్‌ను ఉపయోగించే ప్రయోగానికి ఐసీసీ అనుమతించింది. దీని ప్రధాన ఉద్దేశం చెడు వెలుతురు కారణంగా ఆట ఆగిపోయే సమయాన్ని తగ్గించడం. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇరు జట్లు పింక్ బాల్‌పై అంగీకరించాలి. ఒకసారి మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఎరుపు బంతి నుంచి పింక్ బంతికి మారడం సాధ్యం కాదు. (ఇది టెస్టు క్రికెట్లో పెద్ద మార్పుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణం లేదా వెలుతురు సమస్యలు తరచుగా ఎదురయ్యే ప్రాంతాల్లో ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు.
చివరి ఓవర్లో వికెట్ పడితే.. వెంటనే ఆట ముగియదు!
ఇప్పటివరకు రోజు ఆట ముగింపు సమయంలో చివరి ఓవర్లో వికెట్ పడితే పరిస్థితిని బట్టి ఆట ముగిసే అవకాశం ఉండేది. కొత్త నిబంధన ప్రకారం చివరి ఓవర్ ఇంకా పూర్తికాకపోతే, వికెట్ పడినంత మాత్రాన రోజు ఆట తప్పనిసరిగా ముగియదు. వాతావరణం, మైదాన పరిస్థితులు అనుకూలంగా ఉంటే మిగిలిన బంతులను కూడా అదే రోజు వేయవచ్చు. దీంతో ఫీల్డింగ్ జట్టుకు ప్రయోజనం కలగడంతో పాటు చివరి క్షణాల్లో ఉత్కంఠ మరింత పెరగనుంది.
ఓవర్‌త్రోపై ఇక స్పష్టత
క్రికెట్లో అప్పుడప్పుడు కనిపించే ఓవర్‌త్రో విషయంలో కూడా ఐసీసీ స్పష్టత తీసుకొచ్చింది. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతిని విసిరి పరుగులు ఆపడం లేదా రనౌట్ చేయడానికి ప్రయత్నించడం జరిగితే దాన్ని ఓవర్త్రోగా పరిగణిస్తారు. అయితే ఫీల్డర్ బంతిని ఆపడానికి లేదా మరో ఫీల్డర్‌కు అందించడానికి చేసిన సాధారణ మిస్ఫీల్డ్ను ఓవర్త్రోగా పరిగణించరు. దీంతో అంపైర్లకు నిర్ణయం తీసుకోవడంలో మరింత స్పష్టత వస్తుంది.
బంతి చేతిలో ఉంటేనే ‘కంట్రోల్’ కాదు!
రనౌట్ లేదా స్టంపింగ్ సమయంలో ఫీల్డర్‌కు బంతిపై పూర్తి నియంత్రణ ఉండాలి. స్టంప్స్‌ను బంతితో తాకిన సమయంలో చేతికి బంతి తగిలి ఉండటం మాత్రమే సరిపోదు. అంటే బంతిని నిజంగా నియంత్రిస్తున్నాడా లేదా అన్నదే కీలకం. ఇది ముఖ్యంగా వేగంగా జరిగే రనౌట్, స్టంపింగ్ సందర్భాల్లో అంపైర్లకు మరింత స్పష్టమైన ప్రమాణాన్ని ఇస్తుంది.
టీ20, వన్డేల్లో కూడా మార్పులు
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇన్నింగ్స్‌ల మధ్య 15 నిమిషాల విరామం ఇప్పుడు ప్రామాణిక నిబంధనగా మారింది. మ్యాచ్‌లో సమయం కోల్పోతే ఈ విరామాన్ని కనీసం 10 నిమిషాలకు తగ్గించవచ్చు. అలాగే వన్డే, టీ20 మ్యాచ్‌లలో డ్రింక్స్ విరామ సమయంలో ప్రధాన కోచ్ లేదా ఆయన నియమించిన వ్యక్తి మైదానంలోకి వచ్చి జట్టుతో మాట్లాడేందుకు అనుమతి ఉంటుంది. బ్యాటర్ కదలిక ఆధారంగా వైడ్‌ను నిర్ణయించే కొత్త విధానాన్ని కూడా వన్డే, టీ20 నిబంధనల్లో శాశ్వతంగా చేర్చారు.
క్రికెట్ వేగం పెంచడమే లక్ష్యం
ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ ప్రకారం, కొత్త మార్పులు బంతులకు సంబంధించిన ప్రమాణాలు, ఫీల్డింగ్‌లో స్పష్టత, ఆట వేగం పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టాయి. మొత్తంగా చూస్తే కొత్త నిబంధనలు క్రికెట్‌ను పూర్తిగా మార్చేవి కాకపోయినా, చిన్న చిన్న ఆలస్యాలు, వివాదాస్పద ఫీల్డింగ్ నిర్ణయాలు, బంతుల ప్రమాణాలు, టెస్టుల్లో వెలుతురు సమస్యలు వంటి అంశాలపై ప్రభావం చూపనున్నాయి.














