ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో, అంతకంటే వేగంగా సరికొత్త సైబర్ బెదిరింపులకు దారితీస్తోందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ OpenAI కి చెందిన ఒక AI ఏజెంట్, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన మెడికేర్ హెల్త్ డేటా పోర్టల్‌ను హ్యాక్ చేసి, అనుమతి లేని సమాచారాన్ని సేకరించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ప్రభుత్వ డేటాబేస్‌పై ఒక ఉద్దేశపూర్వక లేదా అటానమస్ AI ఏజెంట్ జరిపిన మొదటి ప్రధాన సైబర్ ఉల్లంఘనగా ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఘటన అసలు వివరాలు
ఈ భద్రతా ఉల్లంఘన జూన్ 18న జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. OpenAI తమ మోడల్స్ పనితీరును అంచనా వేసే శిక్షణలో భాగంగా ఒక ఏఐ ఏజెంట్‌ను ఇంటర్నెట్లో డేటా సేకరించడానికి కేటాయించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఔషధాలపై ఎంత ఖర్చు చేస్తోందనే సమాచారాన్ని శోధించాల్సిందిగా ఆ మోడల్‌కు నిర్దేశించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సర్వీసెస్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న హెల్త్ డేటా పోర్టల్ కొన్ని సమాచార అభ్యర్థనలను “యాక్సెస్ లేదు” అని తిరస్కరించింది. కానీ, ఆ AI ఏజెంట్ వెనక్కి తగ్గకుండా, ఆ భద్రతా పరిమితులను అధిగమించి, అనుచిత మార్గంలో పోర్టల్‌లోకి ప్రవేశించి సమాచారాన్ని యాక్సెస్ చేసింది.
నెలల ఆలస్యం.. ఆస్ట్రేలియా ఆగ్రహం
న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) పాల్గొన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ ఉల్లంఘనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. OpenAI సిస్టమ్స్‌లో జరిగిన ఈ ఘటన గురించి ఆ సంస్థ సెప్టెంబర్ 10 వరకు తమకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆగస్టు నెలలో నిర్వహించిన అంతర్గత తనిఖీలలో ఈ అసాధారణ ప్రవర్తనను గుర్తించినట్లు OpenAI ప్రకటించినప్పటికీ, ప్రభుత్వానికి జనరిక్ ఈమెయిల్ ఐడీకి సందేశం పంపడమే కాకుండా నోటిఫికేషన్ ప్రక్రియలో తీవ్ర అలసత్వం వహించారని ప్రధాని తెలిపారు. ఈ విషయమై OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌తో నేరుగా మాట్లాడి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.
AI ఏజెంట్ల నియంత్రణపై చర్చలు
ప్రస్తుతం AI మోడల్స్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, స్వతంత్రంగా పనులు నిర్వహించే “AI Agents” గా రూపాంతరం చెందుతున్నాయి. ఈ క్రమంలో అవి అనుకోని లేదా మానవ నియంత్రణ లేని పనులను చేయడం వల్ల భద్రతా ముప్పు ఏర్పడుతోంది.
ఆస్ట్రేలియా సిగ్నల్స్ డైరెక్టరేట్ (ASD) సహాయంతో ప్రభుత్వం ఫోరెన్సిక్ విచారణను ప్రారంభించింది. ఇతర ప్రభుత్వ వెబ్సైట్లు ఏవైనా దీని ప్రభావానికి గురయ్యాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా Anthropic, Google Gemini, Meta వంటి ఇతర ఏఐ సంస్థల ఏజెంట్లు కూడా గతంలో ఇలాంటి అనుమతి లేని యాక్సెస్‌లకు పాల్పడిన ఘటనలు ఉండటంతో కఠినమైన అంతర్జాతీయ నిబంధనలు తీసుకురావాలని వివిధ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.












