1. కృతజ్ఞత
90 ఏళ్ల వృద్ధుడికి ఒకరోజు ఒక వ్యాధి సోకింది ఆయనను వెంటిలేటర్ మీద పెట్టారు, కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ వృద్ధుడికి ఆరోగ్యం కుదుట పడడంతో డిశ్చార్జ్ చేశారు . డిశ్చార్జ్ చేసే రోజు బిల్ చేతిలో పెట్టారు, బిల్లు 50,000 రూపాయిలు అయ్యింది. అది చూసి ఆ వృద్ధుడు బోరున విలపించాడు.
ఏడుస్తున్న వృద్ధుడిని గమనించిన డాక్టర్ ఇలా అన్నాడు, చూడు పెద్దాయనా నీ దగ్గర డబ్బులు లేకపోతే బిల్ కట్టనవసరం లేదు. కానీ తరువాత ఆ వృద్ధుడు చెప్పింది విన్నాక డాక్టర్లు కూడా బోరున విలపించారు.
ఆ వృద్ధుడు ఏం చెప్పాడంటే…..
ఈ 90 ఏళ్ల పాటు నేను దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నాను కానీ ఒక్కరోజు కూడా ఆయనకు నా ధన్యవాదాలు చెప్పలేదు, కానీ ఒక్కరోజు డాక్టర్ సహాయంతో వెంటిలేటర్ మీద గాలి తీసుకున్నందుకు నేను కష్టపడి కూడా పెట్టింది అంతా ఖర్చు అయిపోయింది అన్నాడు.
నిజమే కదా…..
.. ఒక్క రోజులో మన ఊపిరితిత్తులు చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేల రూపాయలు… అదేవిధంగా మన మూత్రపిండాలు చేసే పని డయాలసిస్ మిషన్ చేస్తే 10 వేల రూపాయలు.. అదే విధంగా గుండె మరియు ఊపిరితిత్తుల మిషన్ అయితే రోజుకు లక్షల్లో ఖర్చవుతుంది.. ఇంకా మనిషి మెదడు కి మాత్రం ఏ ప్రత్యామ్న్యాయం రాలేదు, వస్తే గనుక కొన్ని కోట్లలో ఖర్చవుతుంది. అంటే మెడికల్ పరిభాషలో… రోజుకి కొన్ని లక్షల విలువైన పనిని మన శరీరం చేస్తుంది.
దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంతకంటే ఇంకా ఏదైనా బలమైన కారణం కావాలా మీరే ఆలోచించండి.. అందుకే అనుక్షణం దేవునికి కృతజ్ఞతగా ఉందాం ఆయనకు అత్యంత ఇష్టమైన పనులు చేస్తూ స్వ ప్రాణులయందు దయతో ప్రేమతో మెలుగుదాం.
ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది: మనకు ప్రాణవాయువుని ఇస్తున్న చెట్లను, ఆహారం ఇస్తున్న భూమిని, పంట పండిస్తున్న రైతును, దాహం తీరుస్తున్న నీటిని, మన చుట్టుపక్కల మంచిని పంచుతున్న మనుషులను దైవంగా భావించి గౌరవించాలి.
Buy Short Story Books for Kids Online
2. నమ్మకం
అనగనగనగా ఒక ఊరు , ఆ ఊరు పాడిపంటలతో పశువులతో పచ్చగా సస్యశ్యామలంగా ఉండేది కానీ కొంతకాలం తరువాత ఆ గ్రామానికి కరువు కాటకం వచ్చింది. వానలు కురవలేదు పంటలు పండలేదు పశువులకు మేత లేక బక్కచిక్కి పోయి పాలు కూడా ఇవ్వలేనీ పరిస్థితి. ఊరంతా కరువుతో అల్లాడుతుంది.
దానితో గ్రామస్తులంతా ఒకరోజు చర్చించుకుని ఊరిలోని తమ గ్రామ దేవతకు జాతర జరపాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న విధంగానే ఆ ఊరి గ్రామ దేవత గుడిలో హోమాలు పూజలు జరిపించాలి అనుకున్నారు.
మరుసటి రోజు ఉదయాన్నే గ్రామస్తులంతా గ్రామ దేవత గుడి కి బయలుదేరారు. వారి వెంట ఒక చిన్న కుర్రవాడు తన చేతిలో గొడుగు పట్టుకుని గ్రామస్తులతో పాటు బయలుదేరాడు.
ఇంతలో గ్రామస్థులంతా, గొడుగుచేతిలో పట్టుకుని వస్తున్న ఆ బాలునితో ఇలా అన్నారు, ” గొడుగు దేనికి తీసుకు వస్తున్నావు రా? ఆకాశాన మబ్బులు లేవు వర్షం పడే సూచనలు లేవు అయినా నువ్వు గొడుగు ఎందుకు తెస్తున్నావ్ అని అన్నారు.
అప్పుడు ఆ బాలుడు ఇలా చెప్పాడు”ఇప్పుడు వాన లేదనుకో, కానీ మనం హోమాలు ప్రార్ధనలు జపాలు చేసిన తర్వాత వాన వస్తుంది కదా. అప్పుడు జోరున వాన కురిస్తే మనం ఇంటికి తిరిగి రావద్దా ?” అందుకని గొడుగు చేతిలో పట్టుకుని వస్తున్నా అన్నాడు ఆ బాలుడు ఆ గ్రామస్థులతో.
దీనిని బట్టి ఆ ఊరిలో గ్రామస్తులంతా నమ్మకం లేకుండానే వాన కోసం జాతర జరపాలని ప్రార్థనలు చేయాలని నిశ్చయించుకున్నారు ఒక్క ఆ బాలుడు తప్ప ఇది నమ్మకం యొక్క గొప్పతనం.
నీతి: మనం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని పై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి నమ్మకం లేకపోతే ఆ పని చేయకూడదు.
3. బెస్తవానీ ఉపాయం (Stories for kids in Telugu)
ఒక ఊరిలో ఒక మందమతి అయిన యువకుడు ఉండేవాడు, అతన్ని అందరూ వెర్రి వెధవ, తిక్క వెధవ, పిచ్చి వెధవ అని పిలుస్తూ హేళన చేస్తుండేవారు. ఊర్లోవారి మాటలకు అతను చాలా బాధ పడేవాడు. తెలివి పెంచుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే బాగున్ను అని అతని కి అనిపించింది.
ఒకరోజు ఆ యువకుడు సముద్రం ఒడ్డున నడుస్తూ ఉండగా, అక్కడ ఇతనికి చేపలు పడుతూ ఒక బెస్తవాడు కనిపిస్తాడు.
అప్పుడు ఆ బెస్త వానిని ఈ యువకుడు అయ్యా “నాకు తెలివి బాగా పెరగాలంటే ఏం చేయాలి?” అని అడుగుతాడు. దానికి ఆ బెస్తవాడు నువ్వు రోజుకు ఒక చేప మెదడు లెక్కన వండుకుని తింటే నీకు తెలివితేటలు బాగా పెరుగుతాయి అని వానితో చెప్తాడు.
అలాగేనని యువకుడు ఆ బెస్తవాని దగ్గరే రోజూ ఒక రూపాయి ఇచ్చి చేప తలను కొనుక్కుని పోయేవాడు. ఇలా రోజూ బెస్తవాడు తను అమ్మగా మిగిలిన చేపలను ఆ తెలివి తక్కువ యువకుడికి అమ్మి లాభం చేసుకుంటూ ఉంటాడు.
ఇలా ఒక నెల గడిచాక ఆ యువకుడు ఆ బెస్తవాని దగ్గరకు వచ్చి అయ్యా.. “అదేంటి మొత్తం చేప ఖరీదు ఒక రూపాయి అయితే, నువ్వు నాకు చేప తల ఒక్కటే ఒక రూపాయి అమ్ముతున్నావు… ఇది అన్యాయం కదా” అంటాడు. దానికి ఆ బెస్తవాడు నవ్వుతూ “చూసావా…..! నీకు తెలివితేటలు పెరిగాయి!” అంటాడు.
అప్పుడు ఆ యువకుడు తన తెలివితేటలు పెరిగినందుకు తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోతాడు.
నీతి: తెలివి ఎవరి సొత్తు కాదు అవసరాన్ని లేదా అవతలి వ్యక్తి ప్రవర్తనను బట్టి మనలోని తెలివి ప్రదర్శించబడుతుంది.
4. తెలివికి మించిన తెలివి (Stories for kids in Telugu)
ఒక గ్రామంలో పీటర్, రాబట్, శ్రవణ్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వీళ్ల ముగ్గురూ కలిసి అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్న తమ స్నేహితుడ్ని కలవడానికి వెళ్తారు. అతడు ఈ ముగ్గురు స్నేహితులు ని చూసి ఎంతో సంతోషపడతాడు. చనిపోయే ముందుగా ఆ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులని ఒక చివరి కోరిక కోరుతాడు” చూడండి మిత్రులారా నేను చనిపోయాక నా శవపేటికలో మీలో ప్రతి ఒక్కరు ఐదేసి పౌండ్లు వేయండి నాకు అదే సంతృప్తి!” అని కోరుతాడు.
చివరికి చావు పడక మీద ఉన్న ఆ వ్యక్తి మరణిస్తాడు. అప్పుడు పీటర్ తన స్నేహితుడు కోరిన విధంగానే శవపేటికలో 5 పౌండ్లు వేస్తాడు. తరువాత రాబట్ శవపేటిక దగ్గరకు వెళ్లి” చచ్చినవాడు ఎలాగూ వచ్చి మార్చుకో లేడు కదా,” అని పీటర్ వేసిన 5 పౌండ్లు తీసుకుని, పది పౌండ్లకు చెక్ రాసి శవపేటికలో వేసి వెళ్ళిపోతాడు.
అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న శ్రవణ్… తన చెక్ బుక్ తీసి 15 పౌండ్లకు చెక్ రాసి తన స్నేహితుని శవపేటికలో వేసి, రాబట్ వేసిన పది పౌండ్ల విలువగల చెక్కునీ తీసుకొని దానిని సొమ్ము చేసుకుంటాడు.
ఇక్కడ, తెలివిగలవాడు అనుకుని తప్పు చేసిన రాబట్ అతనికంటే తెలివిగల శ్రవణ్ చేతిలో మోసపోతాడు.
Buy Budugu Story Books Written in Telugu on Amazon
5. దొంగజపం
ఒక రోజు రాత్రి ఒక ధనవంతునికి చెందిన తోటలో మామిడిపండ్లను దొంగిలించడానికి ఒక దొంగ వెళ్తాడు, కొన్ని పండ్లను కోసిన తర్వాత పరిగెడుతూ ఉండగా, అలికిడి వినిపించడంతో ఆ తోటలో పని చేసే పనివాళ్ళు దివిటీలు వెలిగించి తోట అంతా వెతుకుతారు.
దొంగతనానికి వచ్చిన ఆ దొంగ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ తోటలో నే ఉన్న ఒక గుడిలోని విభూది తీసుకుని ఒంటి మీద రాసుకొని, చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒక చెట్టు కింద కూర్చుని సాధువులాగా దొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేకపోయారు కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలా సంతోషిస్తారు.
మరుసటి రోజు ఆ తోటలో ఒక సాధువు బస చేసుకున్నాడన్న వార్త దావానలంలా ఊరంత పాకిపోతుంది. చాలామంది ప్రజలు, భక్తులు పండ్లు మరియు తినుబండారాలు తీసుకొనివచ్చి సాధువు కాళ్ల దగ్గర పెడతారు, మరి కొంతమంది ప్రజలు వెండి ,బంగారం, డబ్బులు కూడా అతనికి సమర్పించుకుంటారు.
అప్పుడు ఆ దొంగ తన మనసులో ఇలా అనుకుంటాడు,” అదేంటి నేను దొంగ సన్యాసిని కదా..!” అయినా ఇంత మంది ప్రజలు నా పట్ల భక్తి శ్రద్ధలు చూపుతున్నారు, ఎంత ఆశ్చర్యం అని ఆ దొంగ అనుకుంటాడు.
నేను నిజంగానే సాధువుగా మారితే నన్ను వీళ్ళు మరింత గౌరవిస్తారు అని ఆలోచించి, నిజమైన సాధువు కావడానికి తీర్మానించుకుంటాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే గొప్ప సాధువుగా మారి భగవంతుని కృపను పొందుతాడు.
నీతి: అందరూ పవిత్రతనే గౌరవిస్తారు.