నీతి కథలు పిల్లల చేత చదివించడం మరియు వినిపించడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది ఇప్పుడు వాళ్ళకి ఏదైతే చెబుతామొ, నేర్పిస్తామొ లేదా వినిపిస్తామొ దానిని వారు జీవితంలో 100% పాటిస్తారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు.
దీనిని గ్రహించి మేము ఇక్కడ ప్రతి వ్యక్తి చదవవలసిన కొన్ని నీతి కథలను ఇక్కడ తెలుగులో ప్రచురించడం జరిగింది.
1. సున్నుండలడబ్బా
కిరణ్ అనే కుర్రవాడు కలపాడు అనబడే గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. వాడంటే వాళ్ళ అమ్మకు అమితమైన ప్రేమ, వాడికి ఏమి కావాలో అవి కోరగానే తెచ్చి పెడుతూ ఉంటుంది. వాడి ఇంటర్మీడియట్ పరీక్షలు అవ్వగానే పై చదువులు నిమిత్తం పట్నం వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళమ్మకు మాత్రం ఇకపై తనబిడ్డ దూరంగా ఉండబోతున్నాడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా గుండె తరుక్కుపోతూ ఉంటుంది.
కానీ కిరణ్ తప్పనిసరిగా పై చదువుల నిమిత్తం పట్నం చేరుకోవాల్సి వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తన బిడ్డ బాగా గుర్తొచ్చి ఆ తల్లి తన కొడుకును చూసొద్దామని అనుకుంటుంది. దీనితో పాటు కిరణ్కి పది రోజులు కాలేజ్ కి సెలవివ్వడంతో ఆమె కిరణ్ దగ్గరకి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. ఆమె వెళ్తూ వెళ్తూ కిరణ్ కి ఇష్టమైన సున్నుండలను తయారుచేసుకుని వెళుతుంది.
ఆమె అక్కడికి వెళ్లగానే నగర జీవితానికి అలవాటు పడిన తన కొడుకును మరియు తన కొడుకులో వచ్చిన మార్పును వాడి నడవడికలో గమనిస్తుంది. అలా.. నాలుగు రోజులు అక్కడే ఉండి వాడి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఇంటిదగ్గర పని పడడంతో తిరిగి రావాలనుకుంటుంది . వస్తూ వస్తూ తన కొడుకుతో ఇలా అంటుంది. “నాన్న నేను ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అయింది కానీ నేను నీ కోసం తెచ్చినా సున్నుండలలో ఒక్క దాన్ని కూడా నువ్వు తిననేలేదు నీలో మార్పు గమనించాను, నన్ను మీ నాన్న నాలుగు రోజుల్లో తిరిగి రమ్మన్నాడు అందుకు ఇప్పుడు వెళ్తున్నాను. నేను వెళ్ళాకైనా నీకు నేను ప్రేమతో తెచ్చినా ఆ సున్నుండలను తింటావని అనుకుంటున్నాను అని చెప్పగానే, కిరణ్ అమ్మ నేను నువ్వు తెచ్చిన సున్నుండలను తప్పక తింటాను అని వాళ్ళ అమ్మ కు మాట ఇస్తాడు.
అలా… ఐదు రోజులు గడిచిపోతాయి. ఇంతలో కిరణ్ కి ఇచ్చిన పది రోజుల సెలవులు అయిపోవడంతో తిరిగి కాలేజ్ కి వెళ్లాల్సి వస్తోంది. కాలేజీ కి రెడీ అయిన కిరణ్ వెళ్తూ వెళ్తూ తన చేతి వాచీ కోసం ఇల్లంతా ఎతుకుతాడు. కనిపించకపోవడంతో వాళ్ళమ్మ తీసుకెళ్ళిందేమోనని భ్రమ పడుతాడు. ఎందుకైనా మంచిది ఒక సారి అడిగితే బాగుంటుంది కదా అని వాళ్ళ అమ్మ కు ఒక ఉత్తరం రాస్తాడు.
అమ్మ…. నాకు తిరిగి కాలేజీ ప్రారంభించారు నేను కాలేజీకి వెళుతున్నాను కానీ నా చేతి వాచ్ నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించటంలేదు, అలాగని నువ్వు తీసుకెళ్లావని నేను అనట్లేదు, కానీ వాచ్ బాగుంది కదా.. నాన్నకు ఇస్తే బాగుంటుందని తీసుకొని వెల్లుండోచ్చు కదా అని అనుకుంటున్నాను. అది నా ఫ్రెండ్ నాకు చాలా ఇష్టపడి గిఫ్టుగా ఇచ్చాడు…. అని ఉత్తరం రాస్తాడు కిరణ్.
ఉత్తరం చేరిన ఐదు రోజుల తర్వాత, తిరిగి వాళ్ళ అమ్మ కిరణ్ కు ఇలా ఉత్తరం రాస్తుంది….. బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను ఏదైనా చేస్తాను. నేను వస్తూ వస్తూ నీకోసం తెచ్చిన సున్నుండలు తినలేదని బాధపడుతుంటే నువ్వు నాకు తప్పక తింటానని మాట ఇచ్చావు “అది వాస్తవం”. నువ్వు నా ప్రేమ కి విలువిచ్చి నేను తెచ్చిన సున్నుండలు తిని ఉంటే ఇప్పుడు నాకు ఉత్తరంరాసే అవసరం వచ్చేది కాదు, ఎందుకంటే నీ ఫ్రెండు బహుమతిగా ఇచ్చిన వాచ్ని నేను సున్నుండలు తెచ్చిన డబ్బాలో పెట్టి ఉన్నాను కనుక.
దీనిని చదివి, తను తప్పిన మాటను తలుచుకుని ఏమిచేయాలో తెలియక అమ్మ ప్రేమను మోసం చేశానని బాధపడి, అమ్మని క్షమాపణ కోరుతాడు.
నీతి: తల్లిదండ్రుల్ని తమ బిడ్డలు ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా తండ్రులుకు వాళ్ల బిడ్డల మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు.
Buy Moral and Fun Stories written in Telugu, on Amazon
2. అవివేకం (Stupidity, one of the best short stories in Telugu with moral)
ఒకరోజు ఒక అడవిలో ఒక చీమ పరుగెడుతూ ఉండగా దానికి ఒక ఎలుక ఎదురు వస్తుంది. అప్పుడు ఎలుక చీమని, చీమా చీమా ఎందుకు పరుగెడుతున్నావ్వు అని అడుగుతుంది.
అప్పుడు చీమ నేను అడవిలో నాకంటే పెద్ద జంతువుని చూశాను అది నన్ను తినేస్తోంది అన్న భయంతో పెడుతున్నాను అని ఎలుక తో చెప్తుంది. అప్పుడు ఎలుక!!! వామ్మో పెద్ద జంతువా???!! అయితే అది నన్ను కూడా తినేస్తుంది. అన్నా భయంతో ఎలుక కూడా చీమ తో కలసి పరిగెత్తడం మొదలు పెడుతుంది.
అప్పుడు అడవిలో పరిగెడుతున్న చీమ, ఎలుకకు ఒక కుందేలు ఎదురు పడుతుంది. అప్పుడు కుందేలు ఎలుక చీమలన్నీ ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా చీమ, ఎలుక మేము అడవిలో మాకంటే పెద్ద జంతువుని చూసాము, అది మమ్మల్ని తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతున్నాము అని అంటాయి.
అమ్మో పెద్ద జంతువా!!!??? అయితే అది నన్ను కూడా తినేస్తోంది అన్న భయంతో కుందేలు కూడా చీమ, ఎలుకలతో కలసి పరిగెత్తడం మొదలు పెడుతుంది.
అప్పుడు వాటికి ఒక నక్క ఎదురు పడుతుంది. అప్పుడు నక్క వాటిని ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా అవి మేము అడవిలో మా కంటే పెద్ద జంతువు ని చూసాము, అది మమ్మల్ని తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతూ ఉన్నాము అని సమాధానం చెబుతాయి.
దానికి నక్క అమ్మో పెద్ద జంతువే??? అయితే అది నన్ను కూడా తినేస్తుంది అన్న భయంతో నక్క కూడా చీమ, ఎలుక, కుందేలు తో కలసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అయితే కొంచెం దూరం పరుగెత్తిన తర్వాత నక్కకి చాలా
అలసట వస్తుంది.
అప్పుడు నక్క అమ్మో !!!! నేను ఇంకా పరుగెత్త లేను నా వల్ల కాదు, అని అయినా నాకన్నా పెద్ద జంతువు ఏంటది??? అని చీమ ఎలుక కుందేలు ని ప్రశ్నిస్తోంది నక్క, అప్పుడు కుందేలు ఏమో నాకేం తెలుసు ఎలుక నాకన్నా పెద్ద జంతువు అంటే అది నన్ను తినేస్తుంది ఏమో అన్న భయంతో పరిగెడుతున్నాను, అప్పుడు నక్క ఎలుకను కూడా అడుగుతుంది.
అప్పుడు ఎలుక ఏమో నాకేం తెలుసు చీమ నాకన్నా పెద్ద జంతువు కనిపించిందని చెప్పడంతో నేను కూడా చీమతో కలిసి పరుగెడుతూ ఉన్నాను అని చెప్తుంది ఎలుక. అప్పుడు నక్క చీమ నీ అడుగుతుంది.
హా! నాకన్నా పెద్ద జంతువు అయిన గండుచీమను, నేను అ అడవిలో చూశాను , అది నన్ను తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతూ ఉన్నాను అంటుంది చీమ. ఏంటి గండుచీమ మమ్మల్ని తినేస్తోందా????!! అంటూ చీమని ప్రశ్నిస్తారు ఎలుక, కుందేలు, నక్క.
అప్పుడు చీమ నాకన్నాపెద్ద జంతువు నన్ను తినేస్తుంది అన్నాను కానీ మీ కన్నా పెద్ద జంతువు, మిమ్మల్ని తినేస్తుంది అని నేను చెప్పానా ???? అని అడుగుతుంది చీమ కుందేలు ఎలుక నక్కల ని.. అప్పుడు కుందేలు, ఎలుక ,నక్క మొహం మొహం చూసుకొని చీమనీ నమ్మి ఇంత దూరం పరిగెత్తి నందుకు చాలా బాధ పడతాయి.
నీతి: చూడండి పిల్లలు ఈ కథ ద్వారా మనం ఇతరులు ఎందుకు భయపడుతున్నారు అని తెలియకుండా మనం కూడా భయపడడం అనేది అవివేకం అని తెలుసుకున్నాము.
3. బీర్బల్ సమయస్ఫూర్తి
ఒకరోజు అక్బర్ మహాసభలో, అక్బర్ తన మంత్రి వర్గం తో కొలువుతీరి ఉన్నాడు. ఇంతలో అక్బర్ మనసును ఒక చిలిపి ప్రశ్న తలెత్తింది.
ఆ ప్రశ్నని అక్బర్ తన మంత్రివర్గం తో అడిగాడు మీలో తెలివిగల వారు ఎవరో ఒక్క ప్రశ్నతో ఈ రోజు నేను తెలుసుకుంటాను.
మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో ఎవరైనా లెక్క కట్టి చెప్పగలరా అని అడిగాడు అక్బర్.
ఈ ప్రశ్నకు సభలోని వారంతా తమ తలలు పట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టారు .
అది ఏంటి మహారాజా రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో మనం ఎలా లెక్క పెట్ట గలము, ఆ కాకులు కదలకుండా ఒక్క దగ్గర ఉండవు కదా మరి వాటిని మేము ఎలా లెక్క పెట్ట గలము. అది చాలా కష్టం మహారాజా అని సభలోని సభికులు మహారాజుతో అన్నారు.
ఇంతలో బీర్బల్ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు అక్బర్ ,బీర్బల్ని. బీర్బల్ మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో నువ్వు చెప్పగలవా అని అడిగాడు. ఆ ప్రశ్నకు బీర్బల్ కాసేపు ఆలోచించి తనదైన శైలిలో మహారాజుకు సమాధానం ఇలా చెప్పాడు, చూడండి మహారాజా మన రాజ్యంలో మొత్తం 33,459కాకులు ఉన్నాయి అని సమాధానం చెప్పాడు.
ఈ సమాధానానికి సభలోని సభికులంతా ఆశ్చర్యపోయారు. అదేంటి బీర్బల్ నువ్వు కాకులను లెక్కపెట్టకుండా ఎలా సమాధానం చెప్పగలవు నువ్వు చెప్పిన లెక్కలో ఒక కాకి అయినాతగ్గినా లేక పెరిగిన నీకు నేను మరణదండన విధి స్తాను అని అన్నాడు అక్బర్ బీర్బల్ తో.
దానికి సమాధానంగా బీర్బల్ చూడండి మహారాజా ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే కాకులు ఎక్కువగా ఉంటే అవి పక్క రాజ్యం నుంచి తమ బంధువులను స్నేహితులను చూడ్డానికి వచ్చినట్లు, ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే తక్కువగా ఉంటే మరి మంచిది కాకులు పక్క రాజ్యానికి తమ బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి పక్క రాజ్యానికి వెళ్లి ఉంటాయి అని బీర్బల్ తనదైన రీతిలో సమయస్ఫూర్తితో మహారాజుకు సమాధానం చెప్పాడు.
బీర్బల్ సమయ స్ఫూర్తి కి అక్బర్ మరియు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు.
నీతి: చూడండి పిల్లలు ఈరోజు మనం సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి గడ్డు సమస్య నుంచైనా తెలివిగా తప్పించుకోవచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము.
4. తన కోపమే తన శత్రువు (Your anger is your enemy)
అవంతిపురం అనే గ్రామం లో వెంకయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు కి రమేష్ అనే పదో తరగతి చదివే కుమారుడు ఉండేవాడు. రమేష్ చాలా మంచివాడు కానీ అతనికి కోపం కూడా చాలా ఎక్కువ. కానీ ఎంత కోపం వచ్చినా ఆ కోపం చిటికెలో పోయేది, మళ్లీ కోప్పడిన వారిని క్షమాపణ కోరేవాడు.
రమేష్ ఇలా రోజూ ఎవరో ఒకరుతో గొడవ పడుతూ ఉండేవాడు. అతని తండ్రి వెంకయ్య అతనిని చాలాసార్లు మందలించాడు. కానీ రమేష్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఒకరోజు వెంకయ్య రమేష్ తో ఇలా అన్నాడు, చూడు రమేష్!!! నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు నువ్వు పెరటి వెనక ఉన్న మన తలుపుకి ఒక మేకుని కొట్టు అని చెప్తాడు. వెంకయ్య చెప్పినట్టే రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే అతనికి కోపం వచినప్పుడుల్లా మేకులు కొట్టడం మొదలు పెడతాడు.
కొన్ని రోజులకీ ఆ మెకులతో తలుపు అంతా నిండిపోయి అందవిహీనంగా కనిపించసాగింది. ఒక రోజు వెంకయ్య రమేష్కి ఆ తలుపు చూపించి, చూశావా నాన్న!! నువ్వు కొట్టిన ఈ మేకులతో ఈ తలుపు చూడటానికి ఎంత అందవిహీనంగా తయారైందో కదా! ఇలాగే నువ్వు కోప్పడే కొద్దీ.. ఎదుటివారు కూడా నిన్ను ఇంతే అసహ్యంగా చూడడం మొదలు పెడతారు అని వెంకయ్య రమేష్ కి అర్థమయ్యే విధంగా చెబుతాడు.
అప్పుడు వాళ్ల నాన్నతో రమేష్ నువ్వు చెప్పింది నాకు అర్థమయింది నాన్న, నన్ను నేను కచ్చితంగా మార్చుకుంటాను మరియు నా కోపాన్ని నిగ్రహించుకోడానికి ప్రయత్నిస్తాను! అని అంటాడు. అప్పుడు వెంకయ్య రమేష్ తో నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్నా ప్రతిసారీ ఒక్కొక్కటి చొప్పున తెలుపు నుండి మేకులను తీసివేస్తూ ఉండు అని చెబుతాడు.
అలాగే నాన్నా అని రమేష్ సమాధానం ఇస్తాడు. తరువాతి రోజు నుంచి వెంకయ్య చెప్పిన విధంగానే కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ తలుపు నుండి ఒక మేకుని తీసివేయడం ప్రారంభిస్తాడు, అతను మేకులను తొలగించిన ప్రతీచోటా తలుపు పైన ఆ మేరకు చిన్న చిన్న చిల్లులు పడటం గమనిస్తాడు.
క్రమేణా రమేష్ కోపం తగ్గి మేకులన్నింటిని తీసివేసినా కూడా వాటి తాలూకు రంధ్రాలు మాత్రం తలుపు నిండా మిగిలిపోతాయి. అప్పుడు తలుపు చూడడానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది.
అప్పుడు వెంకయ్య రమేష్ భుజం మీద తన చేతిని వేసి చూడు నాన్నా!!! ఎదుటి వాళ్ళ పై నువ్వు కోపం చూపినప్పుడు వాళ్ళ మనసులో నువ్వు ఒక మేకుని కొట్టినట్టు ఆ తరువాత చెప్పే ప్రతీ క్షమాపణ కొట్టిన మైకు తీసేయడం లాంటిది, నువ్వు ఎంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ళ మనస్సుపైనా ఇలాంటి మచ్చ మిగిలిపోతుంది.
కాబట్టి ఎవర్ని అనవసరంగా కోపగించుకోకూడదు అని వెంకయ్య కొడుకుతో అంటాడు. వెంకయ్య మాటలలోని నిజాన్ని గ్రహించిన రమేష్ తన తప్పుని అర్ధం చేసుకుని, మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించడు.
నీతి: చూడండి పిల్లలు ఈరోజు మన కోపం మనల్ని ఎంత అందవిహీనంగా మారుస్తుందో మరియు తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకున్నాము.
5. తాడి తన్నే వాడు ఒకడు వాడి తల తన్నేవాడు మరొకడు
అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకపు రైతు ఉండేవాడు. అతని పొలానికి నీరు లేక పక్క రైతు పొలంలో ఉన్న కొన్ని బావిలలో ఒక బావిని కొని తన పొలాన్ని సాగు చేయాలని అనుకుంటాడు. ఎలానో కష్టపడి ఒక బావిని కొంటాడు. ఒక రోజు నీటి కోసం బావి దగ్గరకు వెళితే, అప్పుడు అమ్మిన రైతు నీవు కొన్నది బావిని కానీ నీటిని కాదు అని అంటాడు. పాపం ఆ అమాయకపు రైతుకి ఏమి చేయాలో దిక్కు తోచక రాజా అక్బర్ దర్బార్ లోని తెలివి గల మంత్రి అయినా బీర్బల్ దగ్గరికి వెళ్లి తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు.
ఇదంతా విన్న బీర్బల్ బావిని అమ్మిన రైతును పిలిపించి ఇలా అడుగుతాడు. నువ్వు ఆ బావిని అమ్మావు కదా మరి నీళ్లు తోడుకోవడానికి ఎందుకు అతనిని ఆడుకుంటున్నావు అని అడుగగా దానికి ఆ మోసగాడైన రైతు నేను అతనికి బావిని అమ్మాను కానీ నీటిని కాదు అని అంటాడు. దానికి బీర్బల్ కొంతసేపు ఆలోచించి ఆ సమస్యను ఇలా పరిష్కరిస్తాడు. నీవు బావినే అమ్మాను అంటున్నావు అది నిజమే, కానీ అందులో నీటిని అమ్మలేదు అంటున్నావ్ కదా…. అయితే నువ్వు అమ్మిన బావిలో నీ నీటిని ఎందుకు ఉంచావు తప్పు కదా…, కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఆ బావిలోని నీ నీటిని తీసేసుకో. ఇకపై ఆ బావిలో నీ నీరు ఒక్క బొట్టున్న ఒప్పుకునేది లేదు, ఖాళీ బావిని అతనికి ఇవ్వు. ఇందుకు ఆ మోసగాడైన రైతు భయాందోళన చెంది అయ్యా మహాప్రభూ నేను తెలిసి తెలియక పొరపాటు చేశాను నన్ను మన్నించి వదిలేయండి అని వేడుకుంటాడు.
నీతి: తెలిసి తప్పు చేయాలనుకున్నా, తప్పు చేసి తప్పించుకోవాలకొన్నా లేదా ఒకరికి మోసం చేయాలని తలచిన దానికి నువ్వే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
Buy Tenali Raman Story Books Online
6. కూరలావిడ (one of the best short stories in Telugu with moral)
ఒకరోజు ఒక వీధిలో ఒక ఆవిడ ఆకుకూరలు అమ్ముతూ వెళ్తూ ఉన్నది… అప్పుడు ఒక ఇంటి గుమ్మం ముందు ఒక ఆవిడ బియ్యంలో రాళ్లు వేరుతు కూర్చుని ఉంది. ఆమె పక్కనే ఆమె కొడుకు పుస్తకం చదువుతూ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ కూరలు అమ్ముతున్నావిడ అక్కడికి వచ్చింది.
గోంగూర కట్ట ఎంత అమ్మ అని ఆవిడ ఆకుకూరలమ్మే ఆవిడని అడగగా. అమ్మగారు కట్ట 5 రూపాయలు, 4 కట్టలు తీసుకోండి 20 రూపాయలకి ఇస్తాను అంది. అప్పుడు ఆవిడ లేదమ్మా కట్ట మూడు రూపాయలు చేసుకుని ఇవ్వు అనగా. అప్పుడు ఆ కూరలమ్మే ఆవిడ … లేదమ్మా మూడు రూపాయలకి నాకు గిట్టదు అని చెప్పి గంప నెత్తిన పెట్టుకుని వెళుతూ వెనక్కి తిరిగి చివరిగా అమ్మగారు నాలుగు రూపాయలు చేసుకోండి అని అంది. ఈవిడ కుదరదు మూడంటే మూడే అని అంది. అప్పుడు కూరలావిడ సరే అమ్మగారు మూడు రూపాయలు చేసుకొని తీసుకోండి ఇంకేం చేస్తాం అని ఇచ్చి,… మళ్ళీ తన దారిన తాను పోయేకి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది.
అప్పుడు ఆ ఇంటావిడ ఆకుకూరలవిడ మొహం పైన నీరు చల్లి ఇలా అంది. ఏంటమ్మా!!!!!! ఏమి తినలేదా అని అడుగుగా, .. ఇవన్నీ అమ్మేసి ఇంటికెళ్లి వండుకుని తినాలమ్మ అని అంది, ఆ ఆకురాలవిడ ఆమెతో.
సరే….. గంప అక్కడ పెట్టి రా తినివెలుదువు అని చెప్పి ఇంట్లో నుంచి 6 ఇడ్లీలు గిన్నెలో పెట్టుకుని తెచ్చి ఆ కూరలు ఆమ్మే ఆవిడకు ఇస్తుంది.
ఇదంతా గమనిస్తున్న ఆమె కొడుకు ఇలా అడిగాడు” అమ్మ నువ్వు 5 రూపాయల గోంగూర కట్టని మూడు రూపాయలకు ఇమ్మని ఆమెతో బేరమాడావు, కానీ… 30 రూపాయలు విలువగల ఇడ్లీలను ఆమెకు ఉచితంగా పెట్టావు మనకు నష్టం కదా…
అప్పుడు అమ్మ…… చూడు నాన్న వ్యాపారంలో ఎప్పుడూ దానం చేయరాదు… అదేవిధంగా దానం లో ఎప్పుడు వ్యాపారం చూసుకోకూడదు అని చెబుతుంది కొడుకుతో.
7. జిత్తులమారి
ఒక రోజు ఒక కాకికి ఒక మాంసం ముక్క దొరుకుతుంది. కాకి ఎగిరి వెళ్ళి ఒక చెట్టు పై కూర్చొని హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది. ఇలా ఆ కాకి చెట్టు పై కూర్చొని ఆ మాంసం ముక్క నోట్లో పెట్టుకొని తింటూ ఉండగా ఆ దారిలో ఒక నక్క పోతూ చెట్టు పై కూర్చుని ఉన్న కాకిని మరియు దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను చూస్తుంది. పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఉండడం వలన నక్కకి ఆ మాంసం ముక్క చూడగానే నోరూరుతుంది. ఏదో ఒక విధంగా ఆ మాంసం ముక్కను సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది నక్క.
అనుకున్న విధంగానే చెట్టుకు దగ్గరగా వెళ్లిన ఆ నక్క కాకితో మాట్లాడడం మొదలు పెడుతుంది ,”ఏంటి కాకి బావ ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అని అంటుంది..!” . కానీ కాకి ఏమీ బదులు ఇవ్వకుండా” నోట్లో మాంసం ముక్క తో ఎలా మాట్లాడగలను..!” అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది. కానీ నక్క వదిలిపెట్టదు మళ్లీ “ఎక్కడికి వెళ్లివచ్చావు కాకి బావ ఈరోజు నువ్వు చాలా ఉషారుగా కనిపిస్తున్నావే “అని అంటుంది. మాంసం ముక్క పడిపోతుందని భయంతో కాకి మాట్లాడకుండా ఉండిపోతుంది.
మళ్లీ నక్క ఇలా అంటుంది” చలికాలం వెళ్ళిపోయింది వేసవికాలం వచ్చేసింది. కోకిల కన్నా మధురమైన గొంతు నీది నీవు పాడితే వినడానికి ఎంతో బాగుంటుంది అని అనగా”. నక్క పొగడ్తకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే నక్క ఎక్కడ బాధ పడుతుందో అని, పోనీలే ఈసారికి పాడుదాం అని, కా ……అని నోరు తెరచి పాడడం ప్రారంభిస్తుంది, అంతే కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క జారి కింద పడిపోతుంది.
ఇంకేం! ఇదే అదునుగా భావించిన ఆ నక్క తనకు కావలసిన మాంసం ముక్క దొరికింది అని ఆ మాంసం ముక్కను నోట కరిపించుకుని సంతోషంగా అక్కడనుండి పారిపోతుంది.
అప్పుడు కాకీ “ఓసి దొంగ నక్క ఇందుకా..! నువ్వు నన్ను అంతగా పొగిడి పాడించావు” అనుకొని కాకి ఏడుస్తూ అక్కడ నుండి దూరంగా వెళ్లి పోతుంది.
నీతి: పొగడ్తలు ఎప్పుడూ ఇతరుల స్వార్థానికే.
Buy Chandhamama Kathalu Book Online
8. కష్టే ఫలి
పాటలీపుత్రం అనే ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతుకి ముగ్గురు కొడుకులు. ముగ్గురుకి ఇంట్లో కూర్చుని తినడం తప్ప ఏ పని చేతకాదు .వాళ్లను అలా చూసి ఆ రైతు నిత్యము బాధ పడుతూ ఉండేవాడు. ఏవిధంగానైనా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలి అని అనుకుంటాడు ఆ రైతు.
ఒకరోజు ఆ రైతు తన కొడుకులతో ఇలా అంటాడు” నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి పొలంలో ఒకచోట పాతిపెట్టాను, ఇప్పుడు ఆ బంగారు నాణాలు నాకు అవసరమయ్యాయి, చాలా కాలమైంది కదా ఆ కుండ ఎక్కడ పాతిపెట్టనో మర్చిపోయాను. అందుచేత మీరు పొలం అంతా బాగా వెతికి ఆ కుండను నేనెక్కడ పాతి పెట్టానో కనుక్కొని తీసుకురండి అని చెప్తాడు.
కుమారులు సంతోషంతో పొలం దగ్గరికి చేరుకుని కష్టపడి చేనంతా తవ్వి చూస్తారు. కానీ వాళ్ళకి అక్కడ ఏ కుండా కనిపించదు. తిరిగి వాళ్ళు ఇంటికి చేరుకుని వారి తండ్రి తో “అక్కడ ఏ కుండా లేదు, మేము చేనంత త్రవ్వి చూశాము అని చెప్తారు.
అప్పుడు తండ్రి కుమారులతో “బంగారు నాణాలు ఉన్న కుండ పోతే పోయిందిలే”, మీరు కష్టపడి చేనంతా తవ్వారు కదా! “ఇప్పుడు కొన్ని విత్తనాలు కొనితెచ్చి చేలో చల్లండి” అని అంటాడు. సరే అని వాళ్ళు వెళ్లి విత్తనాలు కొనితెచ్చి చేలో చల్లుతారు.
వాళ్ళ అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్దిరోజుల్లోనే మంచి వర్షాలు పడతాయి. పొలమంతా చాలా ఏపుగా పెరుగుతుంది. రైతు చేనువద్దకు వెళ్లి గాలికి రెపరెపలాడే చేనును చూసి మురిసిపోతాడు.
పంట చాలా బాగా పండుతుంది. బస్తాల కొద్ది ధాన్యం బండ్లలలో ఇంటికి చేరుతుంది. తినడానికి కొన్ని బస్తాలను ఇంట్లో ఉంచి మిగిలిన బస్తాలను బజార్లో అమ్మ వలసిందిగా కుమారులకు చెప్తాడు ఆ రైతు.
ధాన్యం అమ్మగా వచ్చిన మూడు వేల రూపాయలను తండ్రికి తెచ్చి ఇస్తారు కుమారులు, అప్పుడు రైతు కొడుకులతో “ఇదే నేను చేలో పాతిపెట్టిన బంగారు నాణాల కుండ”. ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరం కష్టపడి పని చేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది . అప్పుడు మీరు సుఖంగా కాలం గడపవచ్చు మరియు నలుగురికీ సహాయం చేయవచ్చు అని అంటాడు. అప్పుడు రైతు పుత్రులకు జ్ఞానోదయం అవుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులు అవుతారు.
నీతి: కష్టపడితేనే ఫలితం దక్కుతుంది.
9. నిజాయతీ (Telugu moral stories for kids)
అనగనగా ఒక ఊరిలో కృష్ణయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ ఊరికి సమీపం లో ఉన్నా నది ఒడ్డున కట్టేలు కొడుతున్నా సమయం లో కృష్ణయ్య గొడ్డలి పట్టుతప్పి నదిలో పడిపోతుంది. తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది అని బాధపడుతూ నది ఒడ్డున కూర్చొని విచారిస్తూ ఉండిపోతాడు.
కృష్ణయ్య బాధపడడం చూసిన నదీదేవత కృష్ణయ్య ఎదుట ప్రత్యక్షమై ఏంటి కృష్ణయ్య అలా దిగులుగా ఉన్నావు అని ప్రశ్నిస్తుంది.
నేను రోజూ కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మితే గాని నాకు పూట గడవదు, ఇప్పుడు నాకు అన్నం పెట్టే నా గొడ్డలి నదిలో పడిపోయింది అని దిగులుగా సమాధానం చెపుతాడు. దీంతో నదీదేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసి ఇదేనా కృష్ణయ్య నీ గొడ్డలి ఆని ప్రశ్నిస్తుంది. కాదు అని సమాధానం చెపుతాడు కృష్ణయ్య.
మళ్ళీ ఒక వెండి గొడ్డలిని తీసి ఇదేనా అని అడుగుతుంది. మళ్ళీ ఆ గొడ్డలికూడా తనది కాదని చెప్తాడు కృష్ణయ్య. మళ్ళీ తను పోగొట్టుకున్న ఇనుప గొడ్డలిని చూపిస్తూ ఇదేనా నే గొడ్డలి అని ప్రశ్నించగా.. తన గొడ్డలి నీ చూసినా కృష్ణయ్య మిక్కిలి సంతోషించి అదే తన గొడ్డలి అని అంటాడు.
దీనితో నదీదేవత కృష్ణయ్య నిజాయితికి మెచ్చి కృష్ణయ్య కు ఆ మూడు గొడ్డళ్ళూ ఇచ్చి మాయమైపోతుంది.
నీతి: ఎప్పుడూ కూడా మనిషి నిజాయితీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, సహాయం చేయడానికి దేవతలు కూడా వెనుకాడరు.
Buy Chanakya Neethi kathalu Online
10. మంచి స్నేహం (A good moral story in telugu for friends)
ఇద్దరు స్నేహితులు ఒకానొక సెలవు దినమున ఊరు వెలుబయటకు షికారుకి వెళ్తారు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఏదో విషయమై ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి అది మెల్లగా గొడవకు దారి తీస్తుంది, ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడి చెంపపై కొడతాడు.
అప్పుడు రెండోవాడు అక్కడే ఉన్న ఇసుక పై “నా స్నేహితుడు ఈ రోజు నన్ను చెంపపై కొట్టాడు అని రాస్తాడు”. మళ్లీ ఇద్దరూ ముందుకు నడవసాగారు మరి కొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఒక నీళ్లు ఉన్న మడుగు దగ్గరకు వెళ్తారు.
చెంపదెబ్బ తిన్న రెండోవ మిత్రుడు ముందుగా నీళ్లలోకి దిగగా, ఆక్కడ ఊబి ఉండడంతో అతను మడుగులోకి మునిగి పోగా, అప్పుడు మొదటి వాడు తన ప్యాంట్ విప్పి మిత్రునికి దాన్ని అందించి బయటకు లాగి కాపాడుతాడు.
అలా బయట పడ్డాక రెండో మిత్రుడు అక్కడే ఉన్న ఒక బండరాయి పైన ఇలా చెక్కుతాడు. “ఈరోజు నా మిత్రుడు నన్ను ఒక అపాయం నుంచి కాపాడాడు“.
మొదటి విషయాన్ని ఇసుకపై రెండోవ విషయాన్ని రాయిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు రెండవ మిత్రునిని అడగ్గా….
ఇసుక పై ఏదైనా రాస్తే అది కొంతకాలానికి చెరిగిపోతుంది. అలాగే స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. కానీ స్నేహితుడు సహాయం చేసినప్పుడు దాన్ని శాశ్వతంగా గుర్తించుకోవాలి అందుకే బండపై శాశ్వతంగా నిలిచిపోయేలా రాశాను అని చెప్పాడు.
అదివిన్న మొదటి స్నేహితుడు తన స్నేహితుని గొప్ప మనసుని అర్థం చేసుకోలేక తొందరపడ్డానని వాపోతాడు.
నీతి: స్నేహితులే కాదు ఎవ్వరు తప్పు చేసిన క్షమించి మర్చిపోవాలి. కానీ వాళ్ళు చేసిన సహాయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.
Recommended Stories
3. Tenali Ramakrishna Stories in Telugu
4. Yaksha Prashnalu (72 యక్ష ప్రశ్నలు) in Telugu
5. Honey benefits in Telugu (తేనె ప్రయోజనాలు)
Good Morning ma’am,
Your efforts are much appreciable. Thank you for your selfless act.