1. Singinadham jeelakarra with meaning in Telugu
సింగినాదం జీలకర్ర అనే ఈ సామెతని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం.
ఈ “సింగినాదం జీలకర్ర ” అనే సామెత ఎలా పుట్టిందో, ఎందుకు వాడుకలోకి వచ్చిందో మనము ఇప్పుడు చూద్దాం.
సింగినాదం అనేది అడవి ప్రజలు ఉపయోగించే ఒక వాయిద్య పరికరం. దీనిని అడవి దుప్పి యొక్క కొమ్ములతో తయారు చేస్తారు.
* పూర్వకాలంలో సరుకులను ఓడలలో వేర్వేరు ప్రాంతాలకు తీసుకుని వెళ్ళేవారు, అప్పుడు ఓడ రాకను తెలియజేసేందుకు ఒక శంఖారావం లాంటి శబ్దాన్ని చేసేవారు.
అప్పుడు ఈ శబ్దం విని చుట్టుపక్కల నివసించే ప్రజలు, వ్యాపారస్తులు ఓడ వద్దకు వెళ్ళి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునేవారు. ఇలా ఓడ రాకను తెలియజేసేందుకు సింగినాదం అనే వాయిద్యాన్ని ఉపయోగించేవారు.
* ఇలా వస్తువులను తీరప్రాంతాలకు తీసుకు వచ్చేటప్పుడు ఒక ఓడ మాత్రం ఎప్పుడూ జీలకర్రతో నే రేవుకి చేరేది, అప్పుడు కూడా సింగినాదం (శబ్ధం) వెలువదేది, కానీ అక్కడ ప్రజలు మాత్రం రేవు వద్దకు వెళ్ళేవారు కాదు. ఆ(…….. అదేముందిలే జీలకర్ర నే కదా.. ! అని ప్రజలు వ్యాపారస్తులు నిర్లక్యం చేసేవారు. ఆ విధంగా పుట్టినదే ఈ “సింగినాదం జీలకర్ర “అనే సామెత.
ఈ సింగినాదం జీలకర్ర అనే సామెత గురించి మరోక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఎక్కువగా అడవి ప్రాంతంలో నివసించే ప్రజలు, అడవి దుప్పి కొమ్ములతో చేసిన ఈ వాయిద్యాన్ని ఉపయోగించేవారు, మరియు మేక, గొర్రె లాంటి జంతువుల కొమ్ములతో కూడా ఈ వాయిద్యాన్ని తయారు చేసేవారు. ఇలా మేక లేదా గొర్రెల కొమ్మును నీటిలో మరిగించి అందులో ఉన్న గుజ్జును పూర్తిగా తీసివేసి ఈ వాయిద్య పరికరాన్ని తయారు చేసేవారు.
సంస్కృతంలో కొమ్ముని శృంగం అని అనేవారు. ఆ శృంగ నాదమే క్రమేపి “సింగి నాదం”అయ్యింది.
పల్లె ప్రాంతాలలో నివసించే గిరిజనులు అక్కడ అడవి నుంచి సేకరించిన జీలకర్ర ని పట్టణంలో అమ్ముకునేవారు. ఇలా అమ్మడానికి వచ్చినప్పుడు వీరు ఆ ఊరిలో వారికి వినిపించే విధంగా శృంగనాథం ఊదేవారు. అప్పుడు ఈ సింగినాదం శబ్దం విన్న ప్రజలు. ఆ(……. ఏముందిలే జీలకర్రనే కదా…. అనుకునేవారు.
అలా వచ్చిందే ఈ “సింగినాదం జీలకర్ర” అనే ఈ సామెత.
Singinadham jeelakarra meaning: సింగినాదం జీలకర్ర అంటే ఇదేముందిలే చాలా చిన్న విషయం అని అర్థం. అంటే ఒక విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనప్పుడు దానిని తెలియజెప్పడానికి “సింగినాదం జీలకర్ర ” అనే సామెత వాడుతారు.